చార్మినార్‌ సాక్షిగా పాతబస్తీలో మార్మోగిన జై తెలంగాణ

జేఏసీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
న్యాయమడిగిన న్యావాదుల అరెస్టు
ఇదెక్కడి న్యాయమని మండిపడ్డ కోదండరాం
హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి)ః
తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేసేందుకు శనివారం పాతబస్తీలో నిర్వహించిన సన్నాహక కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీ నిర్వహిస్తున్న జేఏసీ కార్యకర్తలు, నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలని కోరుతూ జేఏసీ శనివారం ఉదయం పాతబస్తీలో భారీ ర్యాలీ నిర్వహించింది. సాలర్‌జంగ్‌ మ్యూజియం నుంచి పాతబస్తీ వరకు ర్యాలీ నిర్వహించాలని ఐకాస నిర్ణయించింది. అయితే ర్యాలీ మ్యూజియం నుంచి నాలుగు అడుగులు ముందుకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీని ముందుకు అనుమతించేది లేదని వారు స్పష్టం చేశారు. ర్యాలీకి పోలీసు అధికారుల నుంచి అనుమతి తీసుకున్నామని శాంతియుతంగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకోవడం ఏమిటని జేఏసీ నేతలు పోలీసులను ప్రశ్నించారు. ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడికి భారీ స్థాయిలో చేరుకున్న పోలీసు బలగాలు వలయంగా ఏర్పడి జేఏసీ కార్యకర్తలు ఎటూ చెదిరిపోకుండా చూశారు. జేఏసీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు జేఏసీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేశారు. పోలీసు వాహనాల్లో స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ న్యాయవాదులు పోలీసుల చర్యను
అడ్డుకున్నారు. బలవంతంగా వారిని కూడా పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. అదేసమయంలో అనుచరులతో ర్యాలీగా అక్కడికి చేరుకున్న సీపీఐ రాజ్యసభ సభ్యుడు అజిజ్‌ పాషాను కూడా పోలీసులు అడ్డుకున్నారు. పాషాను అదుపులోకి తీసుకొని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర నేతలకు అమ్ముడుపోయిన పోలీసులు సామరస్యపూర్వకంగా జరుగుతున్న ర్యాలీని అడ్డుకున్నారని ఆరోపించారు. ర్యాలీలో పాల్గొనేందుకు పాతబస్తీకి వచ్చిన జేఏసీ చైర్మన్‌ కోదండరాంను కూడా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసు చర్యలను ఖండించారు. పాతబస్తీలో ర్యాలీని నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నామని ఆయన చెప్పారు. అనుమతి ఉన్నా పోలీసులు ర్యాలీని అడ్డుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అరెస్టు అయిన జేఏసీ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ మార్చ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీని స్థానిక జేఏసీ నేతలు నిర్వహిస్తున్నారని, శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న జేఏసీపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని ఆయన అన్నారు. పోలీసుల అత్యుత్సాహం వల్లే గతంలో కొన్ని సంఘటనలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రా పోలీసు అధికారులు ఆదేశాలతోనే పోలీసులు పాతబస్తీలో ర్యాలీని అడ్డుకున్నారని కోదండరాం అన్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ర్యాలీని అనుమతించలేదని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ర్యాలీకి ప్రభుత్వం నుంచి అనుమతి ఉంది కదా అని ప్రశ్నించగా స్థానికంగా పరిస్థితులు వేరుగా ఉన్నాయని, శాంతిభద్రతల సమస్యల వస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.