చేనేత సంక్షేమానికి కెసిఆర్ పెద్దపీట
జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రులు
దళితబంధు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సవిూక్ష
కరీంనగర్,అగస్టు7(జనంసాక్షి): చేనేత కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశానికి మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ఆయన హాజరై మాట్లాడారు.మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్న నేత కార్మికుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని అన్నారు. చేనేత కార్మికులకు విద్యుత్, రుణాల సబ్సిడీ, ఓనర్ టు వర్కర్, మరమగ్గాల కార్మికులకు ఆర్థికసాయం ఇతర సౌకర్యాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో దసరా, రంజాన్, క్రిస్టమస్ పండుగలకు కార్మికుల వద్ద ప్రభుత్వం దుస్తులను కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేస్తున్నదని గుర్తు చేశారు. చేనేత కార్మికుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. అనంతరం పలువురు చేనేత కార్మికులను మంత్రులు సన్మానించారు. సమావేశంలో మేయర్ వై సునీల్ రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జేసీ శ్యామ్ ప్రసాద్ లాల్, నాయకులు వాసాల రమేష్, మెతుకు సత్యం తదితరులు పాల్గొన్నారు. మరోవైపు కరీంనగర్ జిల్లా కేంద్రంగా దళితబంధు పథకాన్ని ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి దళితబంధు ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లపై సవిూక్ష నిర్వహించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. గొప్పగా ఆలోచించి దళితవర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్నేళ్లలో రాలేదన్నారు. ఈనెల 16న హుజురాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల విూదుగా జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు, దళితబంధు అమలుపై కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సంపూర్ణంగా చర్చించడమే కాక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. దళిత బందు పథకం అమలులో ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేదని కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, కలెక్టర్ కర్ణన్, అడిషనల్ కలెక్టర్ శ్యామ్ లాల్, పోలీస్ ఉన్నతాధికారులతో పాటు అన్ని ముఖ్య శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.