జగన్‌ బెయిల్‌పై 9న సుప్రీం విచారణ

న్యూఢిల్లీ, ఆగస్టు 7 (జనంసాక్షి):కడప ఎంపీ, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నాడు సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్ర హైకోర్టులో ఆయనకు బెయిల్‌ నిరాకరించడంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఇంతకుముందే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినప్పటికీ దానిని ఉపసంహరించుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల ముందు పిటిషన్‌ దాఖలు చేశారు. ఇంతలోనే మనసు మార్చుకుని పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఒకసారి పిటిషన్‌ తిరస్కరణకు గురైతే తిరిగి ఆరు నెలల వరకు మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. హడావుడిగా పిటిషన్‌ను దాఖలు చేయడం ఎందుకు అనుకుని అప్పట్లో ఆ పిటిషన్‌ను రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయ్యేవరకు దాఖలు చేయకూడదని నిర్ణయించుకున్నారని కూడా అప్పట్లో భావించారు.