జనాభా నియంత్రణపై ప్రజల్లో మార్పు రావాలి

ఎంపి పొన్నం ప్రభాకర్‌
కరీంనగర్‌, జూలై 11 : రోజు రోజు పెరుగుతున్న జనాభా నియంత్రణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా కృషి చేయాలని కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యులు పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బుధవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్లమెంట్‌ సభ్యులు పొన్నం ప్రభాకర్‌ ముఖ్య అతిథిగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం జనాభా నియంత్రణకు ఎన్ని ప్రోత్సాహకాలు, కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ మారుతున్న పరిస్థితుల కనుగుణంగా జనరేషన్‌ దృక్పథంలో మార్పురావాలన్నారు. గతంలో సమాజంలో అధిక సంతానం కలిగిన వారికి గౌరవం ఉండేదని, ప్రస్తుతం సమాజంలో మారిన పరిస్థితుల కారణంగా ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చిందని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను తీసుకువెళ్లి విస్తృతంగా అవగాహన కలిగించాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సామాజిక స్పృహతో తమ విధులు నిర్వర్తించి అవగాహన కల్పించాలని అన్నారు. సమాజంలో ఆడపిల్లల జనాభా తగ్గిపోతుందని, ఒక సంతానంతో కుటుంబ నియం త్రణ చేసుకున్న వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జేసి సుందర్‌ అబ్నార్‌, డియుహెచ్‌వో నాగేశ్వరరావు, నర్సింగరావు, రాములు తదితరులు పాల్గొన్నారు.