జాతీయ జల విధానంలో రాష్ట్రాల హక్కులు హరించం ప్రధాని మన్మోహన్‌సింగ్‌

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 28: జాతీయ జలవిధానం రూపకల్పనలో రాష్ట్రాల హక్కులకు వచ్చిన ఇబ్బందేమీ లేదని

ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చెప్పారు. జలవనరులకు సంబంధించి విధాన రూపకల్పనలో రాష్ట్రాలకు ఆందోళన అవసరం లేదని చెప్పారు. జల నిర్వహణలో రాష్ట్రాల హక్కులను కేంద్రం  హరిస్తుందన్న భయాలను ఆయన తోసిపుచ్చారు. శుక్రవారంనాడు ఇక్కడ జరిగిన ఆరో జాతీయ జలవనరుల మండలి సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. సరైన ఆలోచనతో జాతీయ చట్టవ్యవస్థను ప్రతిపాదించాల్సిన అవసరం  ఉందని ఆయన ఉద్ఘాటించారు. శాసన, కార్యనిర్వహణ అంశాలకు సంబంధించి అధికార వికేంద్రీకరణ కోసం కేంద్ర రాష్ట్రాలు ఒకే విధమైన విదానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాలకు  సంక్రమించిన రాజ్యాంగ హక్కులను ఎట్టిపరిస్థితుల్లోనూ కేంద్రం హరించాలనుకోవడం లేదని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా జాతీయ జల విధానంపై కేంద్ర ప్రతిపాదనలను కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మూడు కాంగ్రెసేతర రాష్ట్రాలు ఛత్తీస్‌గడ్‌, జార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లు జాతీయ జలవిధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. జలవనరులు నిర్వహణకు సంబంధించి చట్టాలు రాష్ట్రాలు చేయాలని కేంద్రం కాదని ఆ రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి. ఢిల్లీలో శుక్రవారం జరుగుతున్న ఆరో జాతీయ జలవనరుల మండలి సమావేశంలో మాట్లాడుతూ ఛతీస్‌గడ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ జలసంబంధ చట్టాలు రాష్ట్ర స్థాయిలోనే రూపొందాలని, అప్పుడే వాటి మీద రాష్ట్రాలకు హక్కులుంటాయని అభిప్రాయపడ్డారు. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి అర్జున్‌ ముండా సైతం రమణ్‌సింగ్‌ అభిప్రాయంతో ఏకీభవించారు.