టింటూ లూకాపైనే.. అందరి చూపు!’లెజండ్‌’ దిశగా.. బోల్ట్‌!

పతకాల పట్టికలో అగ్రభాగాన్ని కొనసాగిస్తున్న చైనా అథ్లెట్లు..
లండన్‌, ఆగస్టు 9 :హమ్మయ్యా.. భారత్‌ ఖాతాలో నాల్గో పతకం చేరింది. పతకాల పట్టికలో మంగళవారం వరకు భారత్‌ ఒక రజతం, రెండు కాంస్యాలకే పరిమితమైన విషయం.. లండన్‌ ఒలింపిక్‌ క్రీడలు గత శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మంగళవారం రాత్రి వరకు మూడు పతకాలకే పరిమితమైన భారత్‌.. బుధవారం రాత్రి నాలుగో పతకాన్ని సాధించి.. తాజా ఒలింపిక్స్‌లో భారత్‌ తొలిసారిగా నాలుగు పతకాలు సాధించినట్టయింది. తాజాగా భారత్‌ 1 రజతం, మూడు కాంస్యాలతో మొత్తం 4 పతకాలు సాధించింది.
లండన్‌ ఒలింపిక్స్‌ సెమీఫైనల్స్‌లో మేరీకామ్‌ కాంస్యం సాధించింది. క్రీడాకారిణిగా మేరీకామ్‌ జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఓ నిరుపేద గిరిజన కుటుంబం నుంచి వచ్చింది. తల్లిదండ్రులు జమ్‌ఫీల్డ్స్‌లో పనిచేసేవారు. తల్లిదండ్రులకు తోడుగా తానూ వారికి సహకరించేది. ఆ కష్టాలను ఎదుర్కొంటూనే ఎలాగోలా డిగ్రీ పూర్తి చేసింది. మేరీకి చిన్నతనం నుంచి బాక్సింగ్‌పై మక్కువ. అథ్లెట్‌గా ఎదగాలనుకుంది. అయితే ఎనిమిదో తరగతి తర్వాత సొంతూరు నుంచి ఇంఫాల్‌లోని గిరిజన పాఠశాలకు మారడం ఆమె జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. ఒక చాంపియన్‌ ఇచ్చిన డెమోక్లాస్‌ మేరీకామ్‌లో ఆశలను చిగురింపజేసింది. దాంతో అథ్లెటిక్స్‌ను విడిచి బాక్సింగ్‌ గ్లవ్స్‌ తొడిగింది. 2000లో మణిపూర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో మేరీ విజేతగా నిలిచింది. ఆమె ఫొటోను పేపర్లో చూసిన తల్లిదండ్రులకు అప్పుడే తెలిసింది తమ కూతురు ఓ బాక్సర్‌ అని. ఆమెను ఆశీర్వదించారు. ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ఇక ఆమె వెనుదిరిగి చూడలేదు. కెరీర్‌ను అప్రతిహాతంగా కొనసాగించింది. ఎన్నో పతకాలను సాధించింది. తల్లిదండ్రుల కష్టాలను రూపుమాపింది. ఆ సమయంలోనే ఆమె పెళ్లి చేసుకుంది. ఆమెకు కవలపిల్లలు. దీంతో రెండేళ్ల పాటు గ్లవ్స్‌ చేతబట్టలేదు. ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. మరింత రెచ్చిపోయి ఆడింది. మేరీ ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజా ఒలింపిక్స్‌లో భారత తొలి మహిళా బాక్సర్‌గా నిలిచింది. అంతేగాక కరణం మల్లీశ్వరి, సైనా నెహ్వాల్‌ తర్వాత మూడో అథ్లెట్‌గా మేరీ చరిత్ర సృష్టించింది. వరుసగా ఆరు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పతకం గెలిచిన ఏకైక బాక్సర్‌ మేరీకామ్‌. అలాగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మేరీకామ్‌ 5 స్వర్ణాలు గెలుచుకుంది. 2003లో అర్జున అవార్డు, 2006లో పద్మశ్రీ అవార్డు, 2009లో రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు సొంతం చేసుకుంది.
జమైకా చిరుత గురువారంనాడు రెచ్చిపోనుంది. లెజెండ్‌గా నిలిచేందుకు తహతహలాడుతున్నాడు. తన పోరాట పటిమకు మరింత పదును పెట్టాడు. తన దేశానికే చెందిన బ్లేక్‌ను వెనక్కి నెట్టి 200 మీటర్ల రేసులో విజయభేరి మోగించేందుకు సర్వసన్నద్ధమయ్యాడు. ఇదిలా ఉండగా 100 మీటర్ల స్ప్రింట్‌లో రెండో స్థానంలో నిలిచిన బ్లేక్‌.. గురువారం జరగనున్న ఫైనల్లో బోల్ట్‌కు గట్టి పోటీ ఇవ్వనున్నారు. 200 మీటర్ల ఫైనల్‌ గురువారం అర్ధరాత్రి 1.25గంటలకు ప్రారంభం కానున్నది.

లండన్‌లో పతకాల పట్టికలో బుధవారం రాత్రి కూడా చైనా అథ్లెట్లు తమ హవా కొనసాగించారు. 35 స్వర్ణాలు, 21 రజతాలు.. 19 కాంస్యాలు.. మొత్తం 75 పతకాలు సాధించి తొలిస్థానంలో తమ స్థానాన్ని పదిలపర్చుకున్నారు. అమెరికా 30 స్వర్ణాలతో.. 19 రజతాలతో.. 22 కాంస్యాలతో మొత్తం 71 పతకాలతో ద్వితీయస్థానంలో నిలిచింది. ఇక బ్రిటన్‌ది తర్వాతి స్థానం. 22 స్వర్ణాలతో.. 13 రజతాలతో, 13 కాంస్యాలతో మొత్తం 48 పతకాలతో మూడోస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా మొత్తం 76 దేశాలు పతకాలు సాధించాయి. ప్రస్తుతం భారత్‌ 46వ స్థానంలో ఉంది.
100మీటర్ల హార్డిల్స్‌లో ఆస్ట్రేలియా దిగ్గజం స్యాలీ పియర్సన్‌ రికార్డు సృష్టించింది. 12.35 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణపతకాన్ని కైవసం చేసుకుంది. ఆమెతో రేసులో పాల్గొన్న అమెరికా అథ్లెట్లు హాపర్‌ డాన్‌ 12.37 సెకన్లు.. వేల్స్‌ కెల్లీ 12.48 సెకన్లలో రేసును పూర్తి చేసి వరుసగా రజత, కాంస్య పతకాలు పొందారు. ఇదిలా ఉండగా ఒలింపిక్స్‌ చరిత్రలో ఈ విభాగంలో ఆస్ట్రేలియాకు తొలి స్వర్ణం అందించిన ఘనతను సాధించింది. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో ఆమె రజతంతో సరిపెట్టుకుంది.
భారత ఆశాకిరణం టింటూ లూకా 800 మీటర్ల సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన 800 మీటర్ల హీట్స్‌ నంబరు-2లో లూకా 2.01.75 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. సెమీఫైనల్‌కు అర్హత సంపాదించింది. మొత్తం ఆరు హిట్స్‌ జరుగుతాయి.. ప్రతి హిట్స్‌లో టాప్‌ త్రీలో నిలిచిన అథ్లెట్లు.. ప్రతిభ కనబరచిన మరో ఆరుగురు సెమీఫైనల్‌కు వెళతారు. 23 ఏళ్ల టెంటూ గురువారం అర్ధరాత్రి 12 గంటలకు జరగనున్న సెమీఫైనల్స్‌లో పాల్గొనేందుకు సర్వ సన్నద్ధమైంది. సెమీఫైనల్‌లో మొత్తం 24 మంది అథ్లెట్లు పోటీ పడతారు. తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్స్‌కు వెళతారు. ఇంతకీ టింటూ లూకా ఎవరో తెలుసా.. పీటీ ఉష శిష్యురాలు!