బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేష్‌ఖన్నా కన్నుమూత


ముంబయి, జూలై 18 : బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేష్‌ఖన్నా (69) కన్నుమూశారు. బాంద్రాలోని తన నివాసంలో తీవ్ర అనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం మరణించారు. గత 20 రోజులుగా ఆయన ఎటువంటి ఆహారాన్ని తీసుకోవడం లేదు. డింపుల్‌ కపాడియా, ట్వింకిల్‌ ఖన్నా, రింకీఖన్నా, అల్లుడు అక్షయ్‌కుమార్‌, తదితర కుటుంబ సభ్యులు ఆ సమయంలో ఆయన చెంతనే ఉన్నారు. ఇదిలా ఉండగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను జూన్‌ 23వ తేదీన చికిత్స కోసం లీలావతి ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్చారు. ఆ సమయంలో ఆయన తన అల్లుడి అక్షయ్‌కుమార్‌తో కలిసి తనను చూడడానికి వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. ఆయన స్వల్పంగా కోలుకోవడంతో ఈ నెల 8వ తేదీన బాంద్రాలోని నివాసానికి ఆయన్ను తరలించారు. అయితే ఈ నెల 14న మళ్లీ ఆయన అస్వస్థతకు లోనవ్వడంతో లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 17న స్వస్థత చేకూరడంతో తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. బుధవారం ఉదయం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం మధ్యాహ్నం ఆయన కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, నటీనటులు బాంద్రాలోని ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.
బాలీవుడ్‌ శోభన్‌బాబు ఇకలేరు..
బాలీవుడ్‌ శోభన్‌బాబుగా ప్రఖ్యాతిగాంచిన రాజేష్‌ఖన్నా ఇకలేరు అన్న విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. రాజేష్‌ఖన్నా 1942, డిసెంబరు 29న అమృత్‌సర్‌లో జన్మించారు. ఆయనకు చిన్నప్పటి నుంచి నాటకాల పిచ్చి. దాంతో హీరో కావాలన్న లక్ష్యంతో ముంబయికి చేరుకున్నారు. ఆయన అసలు పేరు జతిన్‌ఖన్నా. సినిమాల్లో నటించడం ప్రారంభించాక ఆయన పేరును కుటుంబ సభ్యులు రాజేష్‌ఖన్నాగా మార్చారు. 1966లో ఆఖరిఖత్‌ సినిమాతో ఆరంగేట్రం చేశారు. అయితే ఆయన సినీ జీవితాన్ని ‘ఆరాధన’ చిత్రం గొప్ప మలుపుతిప్పింది. ఆ సినిమాతో ఆయన స్టార్‌డమ్‌ మారిపోయింది. ఆ సినిమా నుంచి ఆయన రొమాంటిక్‌హీరోగా.. బాలీవుడ్‌ శోభన్‌బాబుగా పేరొందారు. 1976-78మధ్య ఆయన నటించిన సినిమాలు 15 విడుదలైతే అన్నీ సూపర్‌హిట్లే. ‘మేరీ సప్నోంకి రాణి’ పాట ఎక్కడ విన్పించినా అందరి కళ్లు ముందు ఆయన రూపం సాక్షాత్కరించడం అక్షరసత్యం. 1973లో డింపుల్‌ కపాడియాను వివాహం చేసుకున్నారు. బాబీ సినిమాలో డింపుల్‌ కపాడియా బికినీలో నటించడాన్ని తట్టుకోలేకపోయారు. వారిద్దరి మధ్య మనస్పర్దలు ఏర్పడ్డాయి. కొంత కాలానికి అవి సర్దుకున్నాయి. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ట్వింకిల్‌ఖన్నా, రింకీఖన్నా. వారిద్దరూ కూడా సినీనటీమణులు. 1991లో న్యూఢిల్లీ నుంచి కాంగ్రెస్‌ ఎంపిగా ఆయన గెలుపొందారు. ఆయన మొత్తం 163 సినిమాలో నటించారు. వాటిల్లోని 106 సినిమాల్లో సోలో హీరోగా కొనసాగారు. నిర్మాతగా మూడు సినిమాలు నిర్మించారు. సహ నిర్మాతగా 3 సినిమాలకు భాగస్వామ్యం నిర్వహించారు. ఎనిమిది సినిమాల్లో ఆయన పాటలు కూడా పాడారు. బాలీవుడ్‌లో ఆయన్ను ముద్దుగా ‘కాకా’ అని పిలుచుకోవడం అందరికీ తెలిసిన విషయమే. ఆయన నటించిన ఆఖరి చిత్రం.. దో దిలోంకే ఖేల్‌ మే.