తెలంగాణకు కట్టుబడి ఉన్నాం : మంత్రి

నిజామాబాద్‌, జూలై 29: తెలంగాణ అంశంపై కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎపియుడబ్ల్యుజె జిల్లా నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టులు- నైతిక విలువలు అంశంపై నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని అధిష్ఠానం ఆదేశాల మేరకు బాధ్యత గల మంత్రులుగా ఎక్కువగా స్పందించడంలేదని ఆయన అన్నారు. సమాజంలో చురుకైన పాత్రను పోషిస్తున్న జర్నలిస్టులు నైతిక విలువలకు కట్టుబడి పని చేయాలని ఆయన సూచించారు. జర్నలిస్టుల సమస్యల సాధన కోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలో తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా ప్రతినిధులు, అధికారులకు తెలియని అనేక విషయాలను వెలుగులోకి తీసుకువస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. పత్రికల్లో వచ్చే వార్తలకు స్పందిస్తూ వాటిని పరిష్కరిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌, ప్రభుత్వ విప్‌ అనిల్‌, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు గంగాధర్‌, పిసిసి కార్యదర్శులు సురేందర్‌, రత్నాకర్‌, ఎపియుడబ్ల్యుజె రాష్ట్ర నాయకులు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.