దళితబంధు కోసం విపక్ష నేతల అరెస్ట్
ఇలాంటి పరిస్థితులు ఎందుకన్న ఈటెల
ఎన్నికకు ముందే ఇంటింటికీ పదిలక్షలు చేరాలని డిమాండ్
కరీంనగర్,అగస్టు16(జనంసాక్షి): హుజురాబాద్ నియోజకవర్గంలో ’దళితబంధు’ పథకం ప్రారంభం సందర్భంగా బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గంలో పలువురు నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని హౌస్ అరెస్ట్ చేసి ఇంటికే పరిమితం చేశారు. ఈ పరిణామాలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. వేల మంది అరెస్టులతో హుజురాబాద్ భయం గుప్పిట్లో ఉందని, పోలీస్ స్టేషన్లు, స్కూల్స్ సరిపోవడం లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వ డబ్బులతో కేసీఆర్ పార్టీ ప్రచారం చేసుకుంటున్నాడని, వాసాలమర్రిలో ఇప్పటికే ప్రారంభించబడిన దళితబంధుకి ఇంత పెద్ద ఎత్తున ప్రచారం ఎందుకని ఆయన నిలదీశారు. ’దళితబంధు’ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్, హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క దళిత కుటుంబానికి హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ’దళితబంధు’ కింద పది లక్షల రూపాయల అందించాలని డిమాండ్ చేశారు. అది కూడా కలెక్టర్, అధికారులు, బ్యాంక్ మేనేజర్ల అజమాయిషీ లేకుండా ఖర్చు పెట్టుకొనే స్వేచ్ఛ కల్పించాలని కోరారు. హుజురాబాద్ ప్రజలు కేసీఆర్ను నమ్మే పరిస్థితుల్లో లేరని, ప్రజలు వస్తారో రారో అనే భయంతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు బస్సులు పెట్టి టీఆర్ఎస్ కార్యకర్తలను సభకు తరలిస్తున్నారని చెప్పారు. ఒక కిలోవిూటర్ దూరంలో ఉన్న ఊరికి కూడా ఖిఅ బస్సులు పంపి జనాన్ని తరలిస్తున్నారంటే టీఆర్ఎస్ ప్రభుత్వ పరిస్థితి ఏంటో అర్దం అవుతుందని అన్నారు. సభ జరుగుతున్న ఊరికి కూడా బస్సులు పెట్టి జనాన్ని తీసుకుపోయే దుస్థితికి అధికార పార్టీ చేరుకుందని అన్నారు. అసలు ఇది ప్రజల విూటింగ్ కాదని ఈటల అన్నారు. విూటింగ్కు తరలించే బాధ్యత టీచర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్స్, ªపఖీక్షలు, ªపఖీంలు వేలమందికి అప్పగించారని చెప్పారు. వీరితో పాటు 10 వేల మంది పోలీసులను బందోబస్తుకు పెట్టారని.. వీరితోనే సభా ప్రాంగణం నిండిపోతుందేమోనని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. హుజురాబాద్ నియోజకవర్గం పోలీసుల పహారాలో ఉందని, వేలమందిని ముందస్తు అరెస్ట్లు చేశారని చెప్పారు. పోలీస్ స్టేషన్లు, స్కూల్స్ నిండిపోయి సరిపోవడం లేదని అన్నారు. ఇలాంటి నిర్భంధాల మధ్య కేసీఆర్ హుజురాబాద్ వస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ నియోజకవర్గం అంతా భయం గుప్పిట్లో ఉందని, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈటల హెచ్చరించారు. ’దళితబంధు’ కడు బీదరికంలో ఉన్న దళితులను ఆదుకోవడానికి పెట్టిన పథకమని, కానీ ఇంత డబ్బు ఖర్చుచేసి ప్రచారం ఎందుకని ఈటల
ప్రశ్నించారు. అయినా ఒకసారి ప్రారంభించిన కార్యక్రమానికి ఇంత భారీ ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నారని ఈటల అన్నారు. వాసాలమర్రిలో ప్రారంభించిన ’దళితబంధు’ కార్యక్రమానికి ఎన్నికల కోసమే ఇక్కడ అతి ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎవడి సొమ్మని ప్రభుత్వదనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును పార్టీ ప్రచారానికి వాడుకుంటున్న కేసీఆర్ ప్రజలకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ధనంతో సోకులు పడుతున్నారని అన్నారు. కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ సొంత ప్రచారం చేసుకుంటున్నారని, ఈ డబ్బు పెడితే ఎన్నో పేద కుటుంబాలు బాగుపడేవని అభిప్రాయపడ్డారు. దళితులతో పాటు ఇతర కులాలలో కడు పేదరికం అనుభవిస్తున్న ప్రతీ కుటుంబానికి ఇది అందిచాలని ఈటల డిమాండ్ చేశారు. ఎరుకల, వ్డడెర, సంచార జాతులు, కుమ్మరలు,విశ్వకర్మలు, పద్మ శాలీలు, నాయీ బ్రాహ్మణులు, రజకు, గౌడ, ముదిరాజ్, కాపుతో పాటు తెలంగాణలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇది అందించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.