నిజాయితీ అధికారి బ(ది)లి

ఐఏఎస్‌ అధికారి అశోకాఖేమ్కా స్థానచలనం
వాద్రా-డీఎల్‌ఎఫ్‌ పై విచారణకు ఆదేశించిన పర్యవసానం

ఛండీగఢ్‌/న్యూఢిల్లీ, అక్టోబర్‌ 16(జనంసాక్షి) :: తమ వారి కోసం ఏమైనా చేస్తామని కాంగ్రెస్‌ మరోమారు నిరూపించింది. అవినీతిని ఎదురిస్తే.. పాలకులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే.. ఏ జరుగుతుందో చేసి చూపింది. ఫలితం.. అక్రమాలపై విచారణ ఆదేశించిన పాపానికి ఓ ఉన్నతాధికారిపై బదిలీ వేటు పడింది. రియల్‌ ఎస్టేట్‌ సంస్థ డీఎల్‌ఎఫ్‌- కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా అల్లుడు రాబర్ట్‌ వాద్రా భూ వ్యవహారంపై విచారణకు ఆదేశించిన మూడు రోజుల్లోనే ఐఏఎస్‌ అధికారిని హర్యానా ప్రభుత్వం బదిలీ చేసింది. వాద్రా, డీఎల్‌ఎఫ్‌లకు సంబంధించిన భూముల వ్యవహారంపై విచారణకు ఆదేశించిన రిజిస్టేష్రన్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ అశోక్‌ ఖెమ్కా బదిలీ అయ్యారు. డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న అశోఖ్‌ను.. హర్యానా సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నియమించింది. ఆయన కంటే 12 ఏళ్ల జూనియర్‌ అయిన అధికారి కింద ఆయనను నియమించడం గమనార్హం. నిజాయితీకి మారు పేరైన ఆయన 20 సంవత్సరాల సర్వీసులో 40 సార్లు బదిలీ కావడం విశేషం.
వాద్రా-డీఎల్‌ఎఫ్‌ల భూముల వ్యవహారంపై వారం రోజులుగా తీవ్ర ఆరోపణలు రావడంతో అశోక్‌ ఖెమ్కా స్పందించారు. విూడియాలో వార్తలు వచ్చిన ఆరోపణల ఆధారంగా.. విచారణకు ఆదేశించారు. గుర్గావ్‌, ఫరీదాబాద్‌, పల్వాల్‌, మెవాత్‌ జిల్లాల్లో 2005 జనవరి 1 నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ వరకు వాద్రా, ఆయన సంస్థలకు సంబంధించిన రిజిస్టేష్రన్‌ పత్రాలన్నింటినీ పరిశీలించాలని ఈ నెల 12న డిప్యూటీ కమిషనర్లను, అధికారులకు సూచించారు. అదే సమయంలో వాద్రాకు చెందిన స్కైలైట్‌ హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, డీఎల్‌ఎఫ్‌కు మధ్య కుదిరిన భూ విక్రయ ఒప్పందంలో అవకతవకలున్నాయనే నేపథ్యంలో.. ఆ ఒప్పందాన్ని కూడా ఆయన రద్దు చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు.
రిజిస్టేష్రన్‌ శాఖపై వచ్చిన ఆరోపణలను ఖండించేందుకే ఈ నెల 8న విచారణకు ఖేమ్కా తెలిపారు. విూడియాలో వచ్చిన వార్తలు వచ్చిన నేపథ్యంలో.. తన శాఖ ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించేందుకే విచారణకు ఆదేశించానని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం తీసుకున్న మూడ్రోజులకే ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ అక్టోబర్‌ 11న ఉదయం 10 గంటలకే తన ఇంటికి ఆదేశాలు పంపించారన్నారు. అయితే, తన బదిలీపై వ్యాఖ్యలు చేసేందుకు ఆయన నిరాకరించారు. అవకతవకలను నిగ్గతేల్చేందుకే విచారణకు ఆదేశించానని, మిగతా విషయాలను కోర్టులు తేల్చాలన్నారు. విచారణకు ఆదేశించినందుకే ప్రభుత్వం బదిలీ చేసిందా? అని ప్రశ్నించగా.. ప్రభుత్వాన్నే అడగాలని సూచించారు. ’20 ఏళ్ల సర్వీసులో 40 సార్లు బదిలీ అయ్యాను. తరచూ ఎందుకు ట్రాన్స్‌ఫర్‌ అవుతున్నానో తెలుసుకోవాల్సి ఉంది. మంచి అధికారి కావాలంటే మంచి చర్యలు చేపట్టాలి’ అని అన్నారు. ట్రాన్స్‌ఫర్‌ చేయడంపై అసహనంతో ఉన్న ఆయన.. బదిలీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చీఫ్‌సెక్రటరీ పీకే చౌదరికి లేఖ రాశారు. ‘ఉన్నపళంగా బదిలీ చేయడం నన్ను షాక్‌కు గురి చేసింది. కుంభకోణాలు, అక్రమాలపై విచారణ ఆదేశించినందుకే రాజకీయ ఒత్తిడి మేరకు నన్న బదిలీ చేశారు’ అని లేఖలో పేర్కొన్నారు. అయితే, ఆయన ఆరోపణలను ఖండించిన రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఖేమ్కా నూతన పదవీ బాధ్యతలు చేపడతారని తెలిపింది.
అయితే, అశోక్‌ ఖేమ్కా బదిలీపై ప్రతిపక్ష బీజేపీతో పాటు ఇండియా అగెనెస్ట్‌ కరప్షన్‌ కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. అవకతవకలపై విచారణకు ఆదేశించడమే ఆయన చేసిన తప్పన్నట్లుగా ట్రాన్స్‌ఫర్‌ చేసిందని బీజేపీ ధ్వజమెత్తింది. రాబర్ట్‌ వాద్రా అక్రమాలపై విచారణ ఆదేశించినందుకే అశోక్‌పై బదిలీ వేటు వేశారని ఐఏసీ సభ్యుడు, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రివాల్‌ మండిపడ్డారు. ఖేమ్కాను ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందో హర్యానా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో ఆచరిస్తున్న విధానాలేమిటో వెల్లడించాలని కోరారు. ఖేమ్కా బదిలీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.