నిప్పులు చిమ్ముతూ నింగిలోకి

పీఎస్‌ఎల్‌వీసీ -21 విజయవంతం
ఇస్రో వందో ప్రయోగాన్ని వీక్షించిన ప్రధాని
శాస్త్రవేత్తలను అభినందించిన మన్మోహన్‌
నెల్లూరు, సెప్టెంబర్‌ 9 (జనంసాక్షి):
అత్యంత ప్రతిష్టాత్మకమైన పిఎస్‌ఎల్‌వీ-సీ21 ప్రయోగాన్ని భారత శాస్త్రవేత్తలు ఆదివారం ఉదయం విజయవంతంగా నిర్వహించడం ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో మరో మైలు రాయిని అధిగమించింది. షార్‌ లోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంనుంచి జరిగిన ఈ ప్రయోగాన్ని భారత ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ప్రత్యక్షంగా వీక్షించారు. పిఎస్‌ఎల్‌వీ-సీ21 ప్రయోగ వాహక నౌక నిర్దిష్ట మార్గంలో ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా నిర్ణీత కక్ష్య దిశగా నింగిలో దూసుకుపోయింది. సతీష్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ వేదిక నుంచి 9.51 గంటలకు జరగాల్సి ఉన్నా రోదసీలో అప్పటికే పరిభ్రమిస్తున్న ఉపగ్రహాలను ఢీ కొనే ప్రమాదం నుంచి నివారించడానికి ప్రయోగ కాలాన్ని మారుస్తూ రెండు నిమిషాలు ఆలస్యంగా 9.53 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. పిీఎస్‌ఎల్‌వీ-సీ21 ప్రయోగించిన 18 నిమిషాల 33 సెకన్లకు ప్రధాన ఉపగ్రహం నిర్ణీత క్షక్ష్యలో ప్రవేశించింది. భూతల ప్రధాన ప్రయోగ కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు అనుక్షణం ఉపగ్రహ మార్గాన్ని పర్యవేక్షించారు. ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం అయిందనీ, ఇది భారత జాతికే గర్వకారణమని ప్రధాన మంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ ప్రయోగం తనకు ఎంతో ఆశ్యర్యం కలిగించిందని, జాతి యావత్తూ గర్వించదగ్గ క్షణాలని ఆయన అభినందనలు తెలిపారు. 43 ఏళ్ళ ఇస్రో చరిత్రలో వంద ప్రయోగాల ద్వారా ప్రపంచంలో భారత్‌ సుస్థిర స్థానం సంపాదించిందని అన్నారు. సమాజానికి మేలు చేసే మరెన్నో ప్రయోగాలు చేపట్టాలని ఆకాక్షించారు. పీఎస్‌ఎల్‌వీ-సీ21 ద్వారా రెండు విదేశి ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ఫ్రాన్స్‌కు చెందిన రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ ‘స్పాట్‌-6’తో పాటు, జపాన్‌లోని ఒసాకా ఇన్‌స్టట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విద్యార్థులు రూపొందించిన పరిశోధక ఉపగ్రహం ‘ప్రోయిటెరీస్‌’ను ఇస్రో ప్రయోగించింది. ప్రోయిటెరీస్‌ బరువు 15 కిలోలు కాగా, స్పాట్‌-6 బరువు 720 కేజీలు ఇస్రో ప్రయోగించే అత్యంత బరువైన విదేశీ ఉపగ్రహం ఇదే.
ఇస్రో శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు
వందో ప్రయోగం విజయవంతమవడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో హర్షాతి రేకాలు మిన్నంటాయి. పీఎస్‌ఎల్‌వీ-సీ21 ప్రయోగం అనంతరం మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఒకిరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ శాస్త్రవేత్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 1975లో ఇస్రో ఏర్పడిన తర్వాత వంద ప్రయోగాలను నిర్వహించింది. వీటిలో పిఎస్‌ఎల్‌విల ద్వారా ఇది 22 వ ప్రయోగం వీటిలో 21 ప్రయోగాలు విజయవంతమవగా ఒక ప్రయోగం విఫలమైంది.ఇప్పటివరకూ66 ఉపగ్రహాలు, 34 శాటిలైట్లను ఇస్రో ప్రయోగించింది. త్వరలో ఇంద్రయాన్‌ -2 పై తాము దృష్టి సారించనున్నామని రాధాకృష్ణన్‌ మీడియాకు తెలిపారు.ప్రయోగం విజయవంతమైన తర్వాత శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని చెన్నై బయలుదేరి వెల్లారు. అక్కడినుంచి ఆయన ప్రత్యేక విమానంలో డిల్లీవెళతారు.