నిరుద్యోగులను మంచుతున్న కేటుగాళ్లు …..

హైదరాబాద్ : ప్రభుత్వ కార్యాలయాల చుట్టు ఉద్యోగం కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్న నిరుద్యోగులకు కొందరు కేటుగాళ్లు ఎరవేశారు. టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగాలు కల్పిస్తామని ఊదరగొట్టారు. ఓ నిరుద్యోగికి గాలం వేసి లక్షలకు లక్షలు దండుకున్నారు. బాధితుడిలో అనుమానాలు పెరగడంతో రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేశారు. కానీ కథ అడ్డం తిరగడంతో అడ్డంగా బుక్కయ్యారు.

నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా…..
ఉపాధి లభించక ఇబ్బందులుపడే నిరుద్యోగులను కేటుగాళ్లు నిండాముంచుతున్నారు. నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకొని నయా మోసాలకు తెగబడుతున్నారు. కోట్లకు కోట్లు దండుకుని పుట్టి ముంచుతున్నారు. రోజుకో రకమైన ఎత్తుతో మోసగాళ్లు వేసే పాచికకు ఎంతో మంది బలైపోతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ముఠా కూడా నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది.

ఈజీమనీ వేటలో తిరుపతయ్య….
బెజవాడకు చెందిన మెంద్యాల తిరుపతయ్య హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈజీమనీ వేటలో పడ్డ ఇతగాడికి.. హైదరాబాద్ మల్కాజిగిరికి చెందిన మీర్ కరార్ అలీ, యాకుబ్ అలీ అలియాస్ కోటేశ్వర్ రావు, మహమ్మద్ అలీలు తోడయ్యారు. విజయవాడకు చెందిన శ్రీనివాస్ వీరి వలలో పడ్డాడు. అప్పటికే రెండు సార్లు అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి అర్హత పరీక్ష రాసాడు. కానీ ఇంటర్వ్యూ వరకు వెళ్లలేదు. ఓసారి ఎస్సై పరీక్షలో అర్హత సాధించినా.. ఎంవీఐ ఉద్యోగం మీదున్న మోజుతో వచ్చిన అవకాశాన్ని వదులుకున్నాడు. అయితే ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న కసితో ఉన్న ఇతగాడికి తిరుపతయ్య బ్యాచ్‌ పరిచయమైంది. టిఎస్‌పీఎస్సీలో తనకున్న పరిచయాలతో ఈజీగా ఉద్యోగం ఇప్పిస్తానని..అందుకు 40 లక్షల ఖర్చు అవుతుందని కోతలు కోశాడు.

10 లక్షలు నష్టపోయిన శ్రీనివాస్….
తమ ముఠా సభ్యుడు యాకుబ్ అలీనే..కోటేశ్వర్ రావుగా పేరు మార్చి టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగం చేస్తున్నాడని శ్రీనివాస్‌కు పరిచయం చేశారు. వీరి మాయలో పడ్డ శ్రీనివాస్ తొలివిడతగా 10 లక్షలు, ఆ తర్వాత మరికొంత మెత్తాన్ని సమర్పించుకున్నాడు. అప్పులు చేసి మరీ వీరికి డబ్బులు కట్టాడు. ఎంవీఐ పరీక్ష ఫలితాలు చూసిన శ్రీనివాస్‌.. తన నెంబర్‌ కనిపంచకపోవడంతో కంగుతిన్నాడు. వెంటనే తిరుపతయ్యను సంప్రదించగా..రెండో లిస్ట్‌లో నీ నెంబర్‌ వస్తుందని నమ్మించారు. ఎంతకీ వారి నుంచి స్పందన రాకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా.. రంగంలోకి దిగిన వారు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 16లక్షల నగదు, 6 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

కేటుగాళ్ళతో జాగ్రత్త….
నిరుద్యోగులకు పంగనామాలు పెట్టేందుకు కేటుగాళ్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. డబ్బులు కడితే ఈజీగా ఉద్యోగం వస్తుందని వీరి మాయలో పడ్డారో ఇక అంతే సగంతులని గుర్తుంచుకోండి. తస్మాత్ జాగ్రత్త.