పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

ఎమ్మెల్యే కొప్పుుల ఈశ్వర్‌

కరీంనగర్‌, నవంబర్‌ 5 :     జిల్లాలో రెండురోజుల క్రితం నీలం తుపానుకు కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంటలు పూర్తిగా నీటపాలైపోయాయని జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సోమవారం నాడు ఆయన వరంగల్‌లో పంటలు పూర్తిగా నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు ఆయనతో పాటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీలం తుపాను తాకిడికి వాణిజ్య పంటలు వరి, మొక్కజొన్న, వేరుశెనగ, పత్తి పంటలు పూర్తిగా నీటమునిగిపోయాయని రైతులు కష్టపడి పండించిన పంట తుపాను తాకిడికి గురి కావడంతో వారి ఆశలు అడియాశలు అయ్యాయని అన్నారు. జిల్లాలో 35వేల క్వింటాళ్ళ పత్తి, 25వేల క్వింటాళ్ళ వరి నష్టం వాటిల్లిందని అన్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని బృందం డిమాండ్‌ చేసింది. గతంలో కురిసిన వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నేటి వరకు నష్టపరిహారం చెల్లించలేదని, వారికి కూడా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.