పప్పులో కాలేసిన పార్థసారథి!

విజయవాడ, ఆగస్టు 3: కృష్ణా జిల్లా మంత్రి కె.పార్థసారథి ఎన్నికల అఫిడవిట్‌ పరిశీలన పూర్తయినట్టు ఒకటి, రెండ్రోజుల్లోనే జిల్లా కలెక్టర్‌ తన నివేదికను ఎన్నికల సంఘానికి సమర్పించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నివేదిక మంత్రికి వ్యతిరేకంగా ఉన్నట్టు కూడా సమాచారం. షరా నిబంధనల ఉలంఘన కేసులో మంత్రి పార్థసారథికి జైలు శిక్ష పడిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో 2009 ఎన్నికల సందర్భంగా పార్థసారథికి దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ కేసు ప్రస్థావన లేదని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. దీనితో ఆ అఫిడవిట్‌ను పరిశీలించి ఎన్నికల సంఘానికి నివేదించాలని జిల్లా కలెక్టర్‌ను ప్రధాని ఎన్నికల అధికారి బన్వర్‌లాల్‌ ఆదేశించారు. కొత్త కలెక్టర్‌గా పదవి బాధ్యతలు స్వీకరించిన బుద్ధదేవ్‌ విధులలో చేరగానే ఈ పరిశీలన చేపట్టారని పార్థసారథి ఎన్నికల అఫిడవిట్‌లో ఈ కేసు ప్రస్థావన లేదని అధికార వర్గాలు తెలిపాయి. ఇదే విషయాన్ని కలెక్టర్‌ ఎన్నికల సంఘానికి నివేదించనున్నారు. ఈ కేసు గురించి ఎన్నికల అఫిడవిట్‌లో పార్థసారథి పేర్కొని ఉండని పక్షంలో ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతుండడంతో దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.