తల్లి మృతి – ప‌రీక్షకు హాజ‌రైన కుమారుడు

కొద్దిగంటల్లో పరీక్షకు వెళ్తామనగా తల్లి చనిపోతే.. చేయిపట్టుకొని నడిపించిన అమ్మ కానరాని లోకాలకు వెళ్లిపోతే (Mothers death).. జీవితం పెట్టిన ఆ పరీక్ష ముందు ఆ పసిమనసు విలవిల్లాడింది. తండ్రి అండలేదు.. సోదరి భవిష్యత్తు కళ్లముందు ఉంది. అందుకే కాలం వేసిన శిక్షకు లొంగిపోవద్దనుకున్న ఆ పిల్లాడు.. అడుగులు ముందుకేశాడు. చివరిసారిగా అమ్మ పాదాలకు నమస్కరించి ఇంటర్‌ పరీక్ష రాయడానికి వెళ్లాడు. హృదయాలను మెలిపెట్టే ఈ ఘటన తమిళనాడు (Tamil Nadu)లో చోటుచేసుకుంది.

తమిళనాడు (Tamil Nadu)లో మార్చి 3 నుంచి ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. తిరునల్వేలిలోని వల్లియూర్‌కు చెందిన సునీల్‌ కుమార్ కొద్దిగంటల్లో పరీక్షకు వెళ్తాడనగా.. గుండె సమస్యతో అతడి తల్లి ఆకస్మికంగా చనిపోయింది. ఆరు సంవత్సరాల క్రితమే తండ్రిని కోల్పోయాడు. ఆ తల్లే సునీల్, అతడి సోదరిని పెంచి పెద్ద చేసింది. వారికి ఆమే ఆధారం. ఇలాంటి సమయంలో తల్లిని కోల్పోయిన ఆ పిల్లాడు ఎంతో వేదనకు గురయ్యాడు. కానీ బంధువులు, చుట్టపక్కలవారి ప్రోత్సాహంతో బాధ దిగమింగుకొని పరీక్ష రాయడానికి వెళ్లాడు.

వెళ్లేముందు చివరిసారిగా తల్లిపాదాల వద్ద హాల్‌టికెట్ ఉంచి ఆశీస్సులు తీసుకున్నాడు. కానీ అప్పుడు తనను తాను నియంత్రించుకోలేక వెక్కివెక్కి ఏడ్చాడు. కానీ ఇతర సభ్యులు అతడిని ఓదార్చి, ఎగ్జామ్ సెంటర్ వద్ద దిగబెట్టారు. బాగా చదవాలని తల్లి కోరుకునేదని గుర్తుచేశారు. మరోవైపు సోదరి భవిష్యత్తు అతడి కళ్లముందు కదలాడింది.

ఈ ఘటన తమిళనాడు ప్రభుత్వం దృష్టికి చేరింది. విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేశ్ బృందం సునీల్‌తో మాట్లాడింది. అవసరంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. ఒక సోదరుడిలా తోడుగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ హృదయవిదారక ఘటనపై సీఎం ఎంకే స్టాలిన్ ఎక్స్ వేదికగా స్పందించారు.