డంకీ రూట్‌లో మరో విషాదం

` అమెరికాకు వెళ్తుండగా ఇద్దరు భారతీయులు కిడ్నాప్‌
గ్వాటెమాలా(జనంసాక్షి):అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని అక్కడి ప్రభుత్వం వెనక్కి పంపుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో భారతీయులు అక్రమంగా ఇతర దేశాలకు వెళ్లడం మానుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్నప్పటికీ కొందరు ప్రమాదకరమైన డంకీ మార్గాల్లో అగ్ర దేశానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈనేపథ్యంలో డంకీ మార్గంలో అమెరికాకు వెళ్తున్న ఇద్దరు భారతీయులు గ్వాటెమాలాలో కిడ్నాప్‌కు గురయినట్లు తెలుస్తోంది. వారిని విడిచిపెట్టేందుకు 20 వేల డాలర్లు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్‌ చేసినట్లు సమాచారం. ఈమేరకు బాధిత కుటుంబాలు వాపోయినట్లు పలు విూడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.కిడ్నాప్‌కు గురైన వారిలో హరియాణాకు చెందిన యువరాజ్‌ సింగ్‌ ఒకరు. ఆయన తండ్రి కుల్దీప్‌సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ‘నా కుమారుడు అమెరికాకు వెళ్లాలనే ఉద్దేశంతో ఓ ఏజెంట్‌ను సంప్రదించాడు. చట్టపరంగా అక్కడికి వెళ్లేందుకు రూ.41 లక్షలకు డీల్‌ కుదిరింది. తొలుత రూ.2 లక్షలు చెల్లించగా.. మిగిలినవి ఆ దేశానికి వెళ్లాక చెల్లించాలనేది ఒప్పందం. అయితే, మధ్యలోనే మరో రూ.14 లక్షలు తీసుకున్నారు. అయితే, అమెరికాకు బయలుదేరిన తర్వాత యువరాజ్‌ నుంచి ఫోన్‌ కాల్స్‌ రాలేదు. ఫోన్‌ నెట్‌వర్క్‌ లేని ప్రాంతాల నుంచి వెళ్తున్నారని, ఆ దేశం చేరుకున్నాక మాట్లాడవచ్చని ఏజెంట్లు భరోసా ఇచ్చారు.అయితే, గతేడాది డిసెంబరులో కిడ్నాపర్ల నుంచి మాకు ఒక వీడియో వచ్చింది. అందులో కొందరు వ్యక్తులు యువరాజ్‌ను చిత్రహింసలు చేస్తూ గన్‌ చూపించి బెదిరించారు. అతన్ని విడిచిపెట్టాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు’ అని కుల్దీప్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కిడ్నాప్‌కు గురైన మరో వ్యక్తి పంజాబ్‌లోని హూషియాపూర్‌ జిల్లాకు చెందినవారు. వారిని విడిచిపెట్టేందుకు 20 వేల డాలర్లు డిమాండ్‌ చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వారి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ట్రావెల్‌ ఏజెంట్లపై స్థానిక పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇక, తమ కుమారులను భారత ప్రభుత్వం రక్షించాలని బాధిత కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొదటినుంచి కఠినంగా ఉంటున్నారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టడంతో వారి గుర్తింపు, తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు. ఈక్రమంలోనే ఇటీవల అనేకమంది భారతీయులను సైనిక విమానంలో వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే.