పిడికిలి బిగించిన సొనియా

C

– రెండో రోజు కాంగ్రెస్‌ ఎంపీల నిరసన

న్యూఢిల్లీ,ఆగస్ట్‌5(జనంసాక్షి):

లోక్‌సభ నుంచి 25మంది కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్షన్‌కు నిరసనగా రెండోరోజు కూడా కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించిన ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి, సీఎంలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, ఆనంద్‌శర్మ, గులాంనబీ ఆజాద్‌ తదితరులు పాల్గొన్నారు.  నల్లరిబ్బెన్లు కట్టుకున్న ఎంపీలు ధర్నాకు దిగి నిరసన చేపట్టారు. కాంగ్రెస్‌ ఆందోళనలకు జేడీయూ, సీపీఐ పార్టీలు సంఘీభావం తెలిపాయి. కాంగ్రెస్‌ ఎమ్‌.పిలు రాహుల్‌ గాంధీ  నాయకత్వంలో నల్లబాడ్జీలు ధరించి ఆందోళన చేస్తున్నారు. గాంధీ విగ్రహం వద్ద వారు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాందీ మాట్లాడుతూ స్పీకర్‌ పై తమకు గౌరవం ఉందని, ప్రజాస్వామ్యంలో స్పీకర్‌ పాత్ర విలువైనదని అన్నారు. అయినా తాము స్పీకర్‌ నిర్ణయాన్ని ఆమోదించలేమని ,అంగీకరించలేమని, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమని రాహుల్‌ ధ్వజమెత్తారు. మోడీ నాయకత్వంలోని ప్రబుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన విమర్శించారు. కాగా కాంగ్రెస్‌ ఎంపిలకు మద్దతుగా ఆర్జెడి, జెడియు ,వామపక్షాలు కూడా ఆందోళన చేశాయి.

పార్లమెంటులో ఆగన ఆందోళన

రాజ్యసభలో కాంగ్రెస్‌ నినాదాలు

న్యూఢిల్లీ,ఆగస్ట్‌5(జనంసాక్షి):

పార్లమెంటు సమావేశాల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. బుధవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే వ్యాపమ్‌, లలిత్‌మోదీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న సీఎంలు, కేంద్రమంత్రి రాజీనామా చేయాలంటూ లోక్‌సభలో విపక్షాలు పట్టుబట్టాయి. కాగా విపక్షాల ఆందోళనల మధ్యే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. రాజ్యసభలో మధ్యప్రదేశ్‌ రైలు ప్రమాదాల్లో మరణించిన వారికి సభ్యులు సంతాపం తెలిపారు. మధ్యప్రదేశ్‌ రైలు దుర్ఘటనపై రాజ్యసభలో కేంద్రరైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు ఓ ప్రకటన చేశారు. అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేయాలంటూ చైర్మన్‌ వెల్‌లోకి దూసుకెళ్లిన సభ్యులు నినాదాలు చేశారు. మంత్రులు రాజీనామా చేయాల్సిందేనంటూ నినాదాలతో ¬రెత్తించారు. డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ పదేపదే వారించినా కాంగ్రెస్‌ సభ్యులు వినలేదు. చర్చకు అనుమతిస్తానని కూడా ఆయన ప్రకటించారు. అయినా వినిపించుకోలేదు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభా కార్యాలపాలు కొనసాగేలా చూడాలని డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ కోరినప్పటికీ సభ్యులు తమ ఆందోళనలను విరమించకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.