త్వరలో మరిన్ని ఆధారాలు బయటపెడతా

` ఎన్నికల సంఘం, భాజపా కుమ్మక్కయ్యాయి
` తమ ఓట్లు దొంగిలిస్తే బిహార్‌ ప్రజలు సహించబోరు
` ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’లో రాహుల్‌ గాంధీ
పట్నా(జనంసాక్షి): ‘ఓట్‌ చోర్‌- గద్దీ ఛోడ్‌’ అనే నినాదంతో ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’ చేపట్టిన కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ భాజపా, ఎన్నికల సంఘంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తమ ఓట్లను దొంగిలిస్తే బిహార్‌ ప్రజలు సహించబోరన్నారు. ఓటర్ల జాబితా నుంచి రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఆక్షేపించారు. అందులో ఎక్కువమంది బడుగు బలహీనవర్గాల వారే ఉన్నారని అన్నారు.సీతామఢీలో నిర్వహించిన ఓటర్‌ అధికార్‌ యాత్రలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ‘ఓట్‌ చోరీ’ గురించి రానున్న రోజుల్లో మరిన్ని ఆధారాలు బయటపెడతానని అన్నారు. ‘’ఎన్నికల సంఘం, భాజపా కుమ్మక్కై ఓట్లను దొంగిలించాయి. గతంలో మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటకలో ఇదే పంథా కొనసాగించారు. ఇప్పుడు బిహార్‌ వంతు వచ్చింది. కానీ, ఇక్కడి ప్రజలు దీన్ని సహించరు.’’ అని అన్నారు. యాత్రలో భాగంగా స్థానిక సీతాదేవి ఆలయాన్ని రాహుల్‌ సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.అంతకుముందు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దొంగిలించిన ఓట్లతో ఏర్పడిరదంటూ రాహుల్‌ విమర్శించారు. ప్రధానమంత్రి కూడా ఓట్ల తస్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు. కొందరు పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించేందుకు ప్రజల ఓటు హక్కును దొంగిలించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఘాటు విమర్శలు చేశారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా, ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ రాహుల్‌ గాంధీ ఓటర్‌ అధికార్‌ యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈనెల 17న ప్రారంభమైన యాత్ర.. 16 రోజుల పాటు 1,300కి.మీ మేర సాగనుంది. వచ్చే నెల 1న పట్నాలో నిర్వహించే భారీ సభతో ముగుస్తుంది.