స‌చివాల‌యాన్ని ముట్ట‌డించిన బీఆర్ఎస్ నేత‌లు

 

 

 

 

 

ఆగస్టు 30(జనంసాక్షి):హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి అన్న‌దాత‌ల‌కు క‌ష్టాలు మొద‌లైన సంగ‌తి తెలిసిందే. నాటి నుంచి నేటి వ‌ర‌కు రైతుల‌కు అండ‌గా నిలుస్తూ.. వారి ప‌క్షాన బీఆర్ఎస్ నేత‌లు పోరాడుతూనే ఉన్నారు. గ‌త కొద్ది రోజుల నుంచి యూరియా కొర‌త‌పై రైతులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రైతుల క‌ష్టాల‌పై బీఆర్ఎస్ నేత‌లు స్పందిస్తూనే ఉన్నారు.

ఇవాళ కూడా వ్య‌వ‌సాయ శాఖ క‌మిష‌న‌ర్‌కు యూరియా కొర‌త‌ను త‌క్ష‌ణ‌మే తీర్చాలంటూ రైతుల త‌ర‌పున బీఆర్ఎస్ నేత‌లు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. వ్య‌వ‌సాయ శాఖ కార్యాల‌యం ముందు బీఆర్ఎస్ నేత‌లు ధ‌ర్నాకు దిగారు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు బీఆర్ఎస్ నేత‌ల‌ను అరెస్టు చేశారు. అనంత‌రం విడుద‌ల చేశారు.

ఆ త‌ర్వాత ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నాయ‌కులు తెలంగాణ స‌చివాల‌యాన్ని ముట్ట‌డించారు. స‌చివాల‌యం ప్ర‌ధాన గేటు వ‌ద్ద బైఠాయించారు. యూరియా కొర‌త తీర్చాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్ర‌మంలో స‌చివాల‌యం వ‌ద్ద ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

యూరియా సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. పండగపూట కూడా రైతన్నలను రోడ్లపై నిలబెట్టింది ఈ ప్రభుత్వం అని ధ్వ‌జ‌మెత్తారు. “గణపతి బప్పా మోరియా – కావాలయ్యా యూరియా” అంటూ నినదించారు. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నినాదాలు చేశారు. రైతన్నలకు యూరియా వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. “రేవంత్ దోషం – రైతన్నకు మోసం” అంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.