పెద్ద ధన్వాడలో దొరికినోళ్లను దొరికినట్టు..
గద్వాల జిల్లా (జనంసాక్షి) : రాజోలి మండలం పెద్దధన్వాడ పరిసర గ్రామాల్లో మరొకసారి భయాందోళనలు కమ్ముకున్నాయి. తుపాకీ నీడన బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులను దొరికినోళ్లను దొరికినట్టు పోలీసులు బంధిస్తున్నారు. ఎక్కడికక్కడ నిలిపేస్తున్నారు. ఊర్లోకి పోనివ్వకుండా.. బయటకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. వందలాది మంది పోలీసులు మోహరించడంతో ఒక్కసారిగా గ్రామాలన్నీ ఉలిక్కిపడ్డాయి. ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పర్యటన నేపథ్యంలో పోలీసులు దుందుడుకు చర్యలకు దిగారు. ఇన్నాళ్లూ కష్టాల్లో ఉన్నప్పుడు రాని నాయకులు.. ఇప్పుడు అభివృద్ధి పేరిట రావడాన్ని గ్రామ
స్తులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ కేసుల విషయంలో రైతులు బాధల్లో ఉన్నప్పుడు పరామర్శించని సంపత్ కుమార్.. ఇప్పుడెందుకు రావడమంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు శుక్రవారం భారీగా మోహరించి.. సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడుతున్నవారిని వెతికి మరీ పట్టుకుంటున్నారు. వాళ్లు దొరక్కపోతే ఇంట్లో వాళ్లను తీసుకెళ్తున్నట్టు సమాచారం. పోరాట కమిటీ నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధించి, వారిచుట్టూ పోలీసులు కాపలా కాస్తున్నారు. ఎవరు ఫోన్లలో మాట్లాడుతున్నా.. వాటిని లాగేస్తున్నట్టు గ్రామస్తులు వాపోతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమను మచ్చిక చేసుకునేందుకు నాయకులు వస్తున్నారంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు. ఫ్యాక్టరీకి వత్తాసు పలికినవారు, కనీసం రైతులను పరామర్శించనివారు మా ఊర్లలోకి రావడమేంటని ప్రశ్నిస్తున్నారు.

పోలీసులు అధికారుల బూతుపురాణం
పెద్దధన్వాడ చుట్టూ పదుల సంఖ్యల్లో మోహరించిన పోలీసులు గ్రామంలోని పలువురిని అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా కొందరిని పోలీసు అధికారులు కొందరు తీవ్ర పదజాలంతో దూషిస్తున్నట్టు తెలిసింది. మళ్లీ కేసుల్లో ఇరికిస్తాం అంటూనే అసభ్యకర మాటలతో గ్రామస్తులను హెచ్చరిస్తున్నట్టు స్థానికులు వాపోతున్నారు. ఇథనాల్ వ్యతిరేక పోరాటంలో మద్దతుగా నిలవలేకపోయినా పర్వాలేదుగానీ, గ్రామస్తుల ఆవేదనను పట్టించుకోవాలని విన్నవిస్తున్నారు.