ఉత్తర తెలంగాణను ముంచెత్తిన వరదలు
` కుంభవృష్టితో కామారెడ్డి, మెదక్ జిల్లాలు అతలాకుతలం
` వరదప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే
` రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్‌ఎస్
` అల్పపీడనంతో అతలాకుతలం
` కామారెడ్డి,మెదక్ జిల్లాల్లో తీరని నష్టం
` రోడ్లు, కల్వర్లుకు గండ్లు..రాకపోకలు అంతరాయం
` నీట మునిగిన పంటలు
` ఊళ్లన్నీ చెరువుల్లా మారడంతో ప్రజల అవస్థలు
` డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాల అందచేత
` ముమ్మరంగా సహాయక కార్యక్రమాలు
` విద్యాసంస్థలకు సెలవులు ప్రకటన
` కాకతీయ పరిధిలో పరీక్షలు వాయిదా
` కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
` మరో రెండ్రోజులు వర్షాలకు ఛాన్స్
` ఏపీనీ వదలని వర్షాలు
` ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద..
` 69 గేట్లు ఎత్తి నీటి విడుదల
హైదరాబాద్(జనంసాక్షి): అల్పపీడనం అతలాకుతలం చేసింది. అల్పపీడన ప్రభావంతో కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు కుంభవృష్టి కురియడంతో భారీ నష్టం జరిగింది. చెరువుల, కాలువులు పొంగిపొర్లాయి. కల్వర్లు, రోడ్లు తెగాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాలు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పంట పొలాలు, నివాస ప్రాంతాలు చెరువులను తలపించాయి. దాదాపు పంటలన్నీ దెబ్బతిన్నాయి. కామారెడ్డి -భిక్కనూర్ మార్గంలో రైలు పట్టాల కింద వరద పోటెత్తడంతో భారీ గండిపడిరది. దీంతో అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వాగు పొంగడంతో కార్లు వరద ప్రవాహంలో కొట్టు-కుపోయాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు- విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. మెదక్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు- వాతావరణశాఖ పేర్కొంది. భారీ వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించ నున్నారు. మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ వర్సిటీ- పరిధిలో పరీక్షలు వాయిదా పడ్డాయి. శుక్రవారం యథాతథంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు- వీసీ యాదగిరిరావు పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికంగా వరద రావడంతో పోచారం ప్రాజెక్టు కట్ట కోతకు గురి అయింది. బుధవారం రాత్రి వరద నీరు అధికంగా రావడంతో అలుగు సవిూపంలో కట్ట కోతకు గురి అయిందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. దానితో ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని నీటిపారుదల శాఖ డీఈ వెంకటేశ్వర్లు చెప్పారు. కోతకు గురైన ప్రాంతంలో ఇసుక బస్తాలను వేయిస్తామని పేర్కొన్నారు. దోమకొండ మండలం సంగమేశ్వర్ ఎడ్లకట్ట వాగు సవిూపంలో వరదలో చిక్కుకొని కారుతో సహా తండ్రీకొడుకులు వాగులో కొట్టుకుపోయారు. దోమకొండకు చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ మేక చిన్న హరిశంకర్, ఆయన కుమారుడు మహేశ్ తమ కారులో.. గోడకూలి మృత్యువాత పడ్డ తన మేనల్లుడి అంత్యక్రియల కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారుపై కూర్చొని సాయం చేయాలంటూ సైగలు, అరుపులు చేశారు. ఇది గమనించిన సంగమేశ్వర్ గ్రామస్థులు జేసీబీ సాయంతో కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. ప్రవాహంలో కొట్టు-కుపోతూ చివరకు చెట్టు-ను పట్టు-కొని అలాగే ఉండిపోయారు. దాదాపు 9 గంటల నరకయాతన అనుభవించిన అనంతరం వరద ఉద్ధృతి తగ్గడంతో వ్యవసాయ భూముల నుంచి పాక్కుంటూ బయటకు వచ్చారు. వారు సురక్షితంగా బయటపడటంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. కామారెడ్డి- ఎల్లారెడ్డి మార్గంలో లక్ష్మాపూర్ గ్రామం వద్ద రోడ్డు కోతకు గురైంది. రాజంపేట మండల కేంద్రంలో వర్షానికి గోడ కూలి యువ వైద్యుడు మృతి చెందాడు. రాజంపేటకు చెందిన వినయ్ (28) గుండారం పల్లె దవాఖానాలో వైద్యుడిగా పని చేస్తున్నారు. భారీ వర్షానికి రాజంపేటలోని దేవుని చెరువు కట్ట తెగి వినయ్ ఇంట్లోకి వరద నీరు చేరింది. నీటిని బయటకు మళ్లించేందుకు గడ్డపారతో గోడకు రంధ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ గోడ కూలి విూద పడటంతో వైద్యుడు వినయ్ అక్కడిక్కడే మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజంపేట మండలంలోని 3 తండాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బీబీపేట మండలంలో 9 మంది యువకులు చెరువు కట్టపై ఇరుక్కు పోయారు. కామారెడ్డి జిల్లా తిమ్మారెడ్డిలోని కల్యాణి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగుపై బొగ్గు గుడిసె సవిూపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్న ఆరుగురు కార్మికులు వరదలో చిక్కుకున్నారు. ఈ వరద కారణంగా కామారెడ్డి- భిక్కనూర్ సవిూపంలో రైలు పట్టాల కింద గండిపడిరది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.ఉమ్మడి ఆదిలాబాద్‌లోని బుధవారం రాత్రి పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడిరది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో గురువారం ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. కడెం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి 20వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు లోతట్లు- ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారికోసం డ్రోన్ సహాయంతో ఆహార పదార్థాల చేరవేత చేపట్టారు. అల్పపీడన ప్రభావంతో మెదక్ జిల్లాలో భారీ వర్షాలు దంచికొట్టాయి. దీంతో వరద ఉద్ధృతికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. హవేలిఘనపూర్ మండలం రాజపేటతండాలోని వాగులో 10 మంది స్థానికులు చిక్కుకుపోయారు. అధికారుల సూచనతో లెప్ట్‌నెంట్ కల్నల్ నిఖిల్ ఆధ్వర్యంలో ఆర్మీ బృందం రంగంలోకి దిగింది. 30 మంది జవానులు రాజాపేటకు చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. పాపన్నపేట మండలం ఎల్లాపూర్ వంతెన వద్ద మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది ప్రవాహదాటికి వంతెన పైకి వరద నీరు చేరింది. వరద కారణంగా మంబోజిపల్లి నుంచి ఎల్లాపూర్ వైపు అధికారులు రాకపోకలు నిలిపివేశారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా 43.1 సెం.విూ వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా అక్కాపూర్‌లో 32.3 సెం.విూ, మెదక్ జిల్లా సర్దానలో 30.2 సెం.విూ, కామారెడ్డి పట్టణంలో 28.9 సెం.విూ, కామారెడ్డి జిల్లా భిక్‌నూర్‌లో 27.9 సెం.విూ, నిర్మల్ జిల్లా వడ్యాల్‌లో 27.9 సెం.విూ, కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 27.5 సెం.విూ, మెదక్‌జిల్లా నాగాపూర్ గ్రామంలో 26.6 సెం.విూ, కామారెడ్డి జిల్లా పాత రాజంపేటలో 24.6 సెం.విూ, లింగంపేటలో 22.5 సెం.విూ, దోమకొండలో 20.2 సెం.విూ, నిర్మల్ జిల్లా విశ్వనాథ్‌పేట్‌లో 24.1 సెం.విూ, ముజిగిలో 23.1 సెం.విూ, మెదక్ జిల్లా చేగుంటలో 20.2 సెం.విూల వర్షం పాతం నమోదైంది.
విద్యాసంస్థలకు సెలవులు ప్రకటన
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో 13 జిల్లాల్లో పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల, సిరిసిల్ల,కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు- విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయకు రాకూడదని అధికారులు సూచించారు. వర్ష ప్రభావం కారణంగా కామారెడ్డి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు ఆగస్టు 29, 30 వరకు సెలవులు ప్రకటించినట్లు- ప్రభుత్వం తెలిపింది. భారీ వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సెలవులను మరో రెండు రోజులు పొడిగించింది. అందువల్ల పాఠశాలలు, కళాశాలలు బంద్ కానున్నాయి.సిద్దిపేట జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో కామారెడ్డి, మెదక్ జిల్లాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
కాకతీయ పరిధలో పరీక్షలు వాయిదా
పలు జిల్లాల్లో ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఆగస్టు 28, 29 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు- రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రాజేందర్ ప్రకటించారు. వర్షాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, మిగిలిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. వాయిదా వేసిన పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా, కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరగాల్సిన బీఎడ్, ఎంఎడ్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. వర్షాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడిరచారు. మిగతా పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టంచేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మోడల్ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరానికి ఆరు నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించినా, ఇంకా సుమారు 48,630 సీట్లు- ఖాళీగా ఉన్నట్లు- గుర్తించామని ఆయన వెల్లడిరచారు.ఇంటర్ రెండో సంవత్సరం 13,256 సీట్లు-, ఇంటర్ ఫస్ట్ ఇయర్ 12,668 సీట్లు-, ఆరో తరగతి 7,543 సీట్లు-, ఏడో తరగతి 5,192 సీట్లు-, ఎనిమిదో తరగతి 3,936 సీట్లు-, తొమ్మిదో తరగతి 2,884 సీట్లు-, పదో తరగతి 3,151 సీట్లు- ఖాళీగా ఉన్నట్లు- వివరించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు నేరుగా సంబంధిత మోడల్ స్కూల్ ప్రిన్సిపల్‌ను సంప్రదించి అడ్మిషన్లు పొందవచ్చని సూచించారు.
వరదలతో అప్రమత్తంగా ఉన్నాం
ఇప్పటికే పదిమంది మృతి చెందినట్లు సమాచారం
ఉత్తర తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదల కారణంగా ఇప్పటి వరకు 10 మంది చనిపోయినట్టు- సమాచారం ఉందని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నట్టు- చెప్పారు. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న దాదాపు 2వేల మందిని రక్షించినట్టు- చెప్పారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ సాయంతో రెండు హెలికాప్టర్ల ద్వారా బాధితులను రక్షించినట్టు డీజీపీ వివరించారు. రెండు వేల మంది సిబ్బందితో ఎస్డీఆర్‌ఎఫ్ ఏర్పాటు- చేసి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు- చెప్పారు. ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఒకవైపు గణేష్ ఉత్సవాలు ఉన్నప్పటికీ.. వరదలపై పోలీసు శాఖ పోరాటం చేస్తోందని తెలిపారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం తరలించేందుకు డీజీపీ కార్యాలయంలో కూడా అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచామని డీజీపీ తెలిపారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
పలురైళ్లు రద్దు..పలు దారిమళ్లింపు
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. దీంతో పాటు- కొన్ని రైళ్లు దారి మళ్లించినట్లు-, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు- దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్ తెలిపారు. 36 రైళ్లు రద్దు, 25 రైళ్లు దారి మళ్లింపు, 14 రైళ్లను పాక్షిక్షంగా రద్దు చేసినట్లు- ఆయన వివరించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల రైలు మార్గంలో వరద నీరు ముంచెత్తింది. దీంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
కామారెడ్డి జిల్లాలో పలు రోడ్లు ధ్వంసం
బీబీపేట-కామారెడ్డి వంతెన ధ్వంసం
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కుంభవృష్టి ధాటికి పలుచోట్ల జనజీవనం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. బీబీపేట నుంచి కామారెడ్డి వెళ్లే మార్గంలో వరద నీటి దాటికి వంతెన కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు క్యాసంపల్లి శివారులో వరద తీవ్రతకు జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో నిజామాబాద్ వైపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. క్యాసంపల్లి శివారులో హైవేపై ఏర్పడిన గుంత కారణంగా రోడ్డు ధ్వంసమైంది. మెదక్-బోధన్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పోచారం జలాశాయానికి భారీగా వరద పో-టె-త్తడంతో మెదక్, బోధన్ ప్రధాన రహదారిపై హై లెవల్ వంతెన కొట్టు-కుపోయింది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇరువైపులా వాహనాలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరో మార్గం నుంచి వాహనాలు ప్రయాణించే విధంగా అధికారులు ఏర్పాట్లు- చేశారు.
భారీ వర్షాలపై పార్టీ శ్రేణులకు కేసిఆర్ ఆదేశం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం కావడం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ నుంచి ఖమ్మం దాకా పలు జిల్లాల్లో వరదలతో నివాసాలు నీట మునిగి, రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ అతలాకుతలమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావడం పట్ల కేసీఆర్ దిగ్భార్రతి వ్యక్తం చేశారు. వరద ప్రభావిత జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్యనేతలకు అధినేత ఫోన్లు చేసి ఈ మేరకు అప్రమత్తం చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ వంతుగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ దిశగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అధినేత కేసీఆర్ సూచించారు.
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీరాలకు సవిూపంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టం నుంచి 5.8 కిలోవిూటర్ల ఎత్తులో ఏర్పడిన ఈ ఆవర్తనం రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా బలపడనుందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే తూర్పు ఆగ్నేయ దిశ నుంచి ఈశాన్య బంగాళాఖాతం వరకు వృత్తాకార పవన ద్రోణి కొనసాగుతోందని వెల్లడిరచింది. సిద్దిపేటలోని శ్రీనగర్ కాలనీ వరద నీటిలో మునిగిపోయింది. రోడ్లపై నుంచి నీరు ఉద్ధృతంగా పారుతుండగా, పలు ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ అధికారులు కాలనీలో నిలిచిపోయిన నీటిని బయటకు తరలించే చర్యలు చేపట్టారు. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం, మరో మూడు రోజులపాటు- తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అనేక జిల్లాలు మళ్లీ వర్ష బీభత్సాన్ని ఎదుర్కొనే అవకాశముందని అధికారులు తెలిపారు. తెలంగాణలో వర్షాల ప్రభావం కొనసాగుతూనే ఉంది. అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు- అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద.. 69 గేట్లు ఎత్తి నీటి విడుదల
భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. బ్యారేజీలోకి ప్రస్తుతం 3,03,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.దీంతో 69 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి 2,97,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి పులిచింతల వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు మూడు గంటల్లో ప్రకాశం బ్యారేజీకి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముంది. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.నదీ పరివాహక పొలాల్లోకి వెళ్లవద్దని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది.
వరదలపై కేసీఆర్ ఆందోళన
` సహాయక చర్యలకు సహకరించాలని పార్టీ శ్రేణులకు పిలుపు
హైదరాబాద్(జనంసాక్షి):రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవస్త్యం కావడం పట్ల బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ నుండి ఖమ్మం దాకా పలు జిల్లాల్లో వరదలతో నివాసాలు నీట మునిగి, రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ అతలాకుతలమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావడం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వరద ప్రభావిత జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్యనేతలకు అధినేత ఫోన్లు చేసి ఈమేరకు అప్రమత్తం చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ తమవంతుగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ దిశగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అధినేత కేసీఆర్ సూచించారు.
2 వేల మందిని కాపాడాం
` 10 మంది మృతి చెందినట్లు సమాచారముంది
` సహాయం కోసం డయల్ 100కు కాల్ చేయండి: డీజీపీ జితేందర్
హైదరాబాద్: ఉత్తర తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాల వల్ల 10 మంది వరకు చనిపోయి ఉండొచ్చని అనుకుంటున్నామని, మరణాలపై ఇంకా స్పష్టత రాలేదని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న దాదాపు 2వేల మందిని రక్షించినట్టు చెప్పారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ సాయంతో రెండు హెలికాప్టర్ల ద్వారా బాధితులను రక్షించినట్టు డీజీపీ వివరించారు. సహాయక చర్యల కోసం డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు.రెండు వేల మంది సిబ్బందితో ఎస్డీఆర్‌ఎఫ్ ఏర్పాటు చేసి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఒకవైపు గణేష్ ఉత్సవాలు ఉన్నప్పటికీ.. వరదలపై పోలీసు శాఖ పోరాటం చేస్తోందని తెలిపారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం తరలించేందుకు డీజీపీ కార్యాలయంలో కూడా అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచామని డీజీపీ తెలిపారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
గోదావరి జలాల తరలింపులో శ్రీపాద కీలకం
కూలిపోయిన ప్రాజెక్టు, నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఉంటుంది
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలో నీటి నిల్వ అసాధ్యం
భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగాఉండాలి
పాతబడ్డ ఇళ్లల్లో ప్రజలను ఖాళీ చేయించాలి
మెదక్,కామారెడ్డిల్లో వదరల పరిస్థితిపై సీఎం ఆరా
హైదరాబాద్(జనంసాక్షి):గోదావరి జలాలను తెలంగాణలో ఎక్కడికి తరలించాలన్నా ఎల్లంపల్లి ప్రాజెక్టు కీలకమైనదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్‌తో కలిసి వరదప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో వచ్చిన వరదలతో పలువురు చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం శ్రీపాద ఎల్లంల్లిని పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం సీఎం విూడియాతో మాట్లాడారు. స్ట్రాటజిక్ లోకేషన్‌తో కట్టిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి అని.. కూలిపోయిన ప్రాజెక్టు, నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఉందన్నారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే ఎల్లంపల్లి దశాబ్దాలుగా నిలబడిరదని పేర్కొన్నారు. మేడిగడ్డ పనికిరాకుండా పోయింది. మేడిగడ్డ రిపేరు చేయకుండా.. అన్నారం, సుందిళ్లలో నీరు నిల్వ చేయొచ్చు కదా? అని విూడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సీఎం సమాధానమిచ్చారు. అతి తెలివితేటలతో మామ, అల్లుడు .. ఒకరు స్వాతి ముత్యం, మరొకరు ఆణిముత్యం అనుకుంటారు. మేడారం, అన్నారం, సుందిళ్ల.. మూడు బ్యారేజీలు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తి అన్నారంలో పోయాలి, అక్కడి నుంచి సుందిళ్ల, శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలి. 3 బ్యారేజీల డిజైన్‌లో, నిర్మాణంలో, నిర్వహణలో లోపం ఉంది. ఏదైనా ప్రమాదం జరిగేతే గ్రామాలకు గ్రామాలు తుడిచిపెట్టుకుపోతాయి. మేం.. 80వేల పుస్తకాలు చదవలేదు. 80 వేల పుస్తకాలు చదివిన మేధావిని సలహా అడుగుతున్నాం ఏం చేద్దామని. మేడిగడ్డ విషయంలో సాంకేతిక కమిటీ- సూచనల ప్రకారం వెళ్తాం. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి ముందుకెళ్తాం అని సీఎం స్పష్టం చేశారు. వరద పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం.. పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతకుముందు కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలపై సవిూక్షించారు సీఎం రేవంత్‌రెడ్డి. అనంతరం మెదక్, పెద్దపల్లి జిల్లాలో సీఎం బృందం ఏరియల్ సర్వే చేసింది. అనంతరం వరదలపై అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సవిూక్ష సమావేశం నిర్వహించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గోదావరి జలాలు గుండెకాయ అని ఉద్ఘాటించారు. కాళేశ్వరం ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని, మామ అల్లుడు ఎన్ని కుట్రలు చేసిన పాపాలు పోవని విమర్శించారు. అల్లుడు స్వాతిముత్యం.. మామ ఆణిముత్యమని ఎద్దేవా చేశారు. నీళ్లు నింపితే గ్రామాలే కొట్టుకపోతాయని చెప్పుకొచ్చారు. మేడిగడ్డ అన్నారం, సుందిళ్ల ప్రాజెక్ట్‌లో లోపాలు ఉన్నాయని వెల్లడిరచారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక వైఫల్యం ఉందని తెలిపారు. డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ లోపం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
సిఎం, ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నుంచి కామారెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ బయలు దేరారు. కామారెడ్డిలో ముంపు పరిస్థితులను పరిశీలించారు. 3 బ్యారేజీల్లో నీటినిల్వ, ఎత్తిపోత క్షేమం కాదని ఎన్డిఎస్‌ఎ చెప్పిందని, నిర్మాణం, నిర్వహణలో లోపం ఉందని నిపుణుల కమిటీ- చెప్పిందని అన్నారు. నీరు నిల్వ చేశాక మొత్తం కూలిపోతే.. గ్రామాలు కొట్టు-కు పోతాయని, కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి ముందుకెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
పాడుబడ్డ ఇళ్లల్లో ప్రజలను ఖాళీ చేయించాలి
హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వినాయక మండపాల సవిూపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్ కో సిబ్బందిని ఆదేశించారు. హైదరాబాద్‌లో హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం పేర్కొన్నారు. నదులు, వాగులపై ఉన్న లోతట్టు- కాజ్‌వేలు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలు నిషేధించాలని సీఎం ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర పాలక, పురపాలక, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించడంతో పాటు- ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటు-లో ఉంచుకోవడంతో పాటు- అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు- చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్న కామారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లను అలర్ట్ చేసిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి. వెంటనే అక్కడ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని, ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కునేందుకు అన్ని విభాగాల అధికారులు సిద్ధంగా ఉండాలని, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాల సాయం తీసుకోవాలని సీఎస్‌కు ఆదేశాలు.