చైనా పర్యటనకు మోదీ
` 31న జిన్‌పింగ్‌తో భేటీ
` ఎస్‌సీఓ సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోదీ
– చైనా, భారత్ సంబంధాలపై కీలక చర్చలు
నాలుగు రోజలు విదేశీ పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం బయలుదేరనున్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు సాగే పర్యటనలో రెండు రోజులు జపాన్‌లో, మరో రెండు రోజులు చైనాలో పర్యటిస్తారు. చైనా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, ఆగస్టు 31నే ఆదేశ అధ్యక్షుడు జిన్?పింగ్?తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. లద్దాఖ్ సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య దెబ్బతిన్న దౌత్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఈ సమావేశం కీలకం కానుంది. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో భారత్‌పై విరుచుకుపడుతోన్న వేళ మోదీ చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.ఆగస్టు 29, 30 తేదీల్లో జపాన్‌లో పర్యటించే ప్రధాని మోదీ, భారత్- జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. పలువురు ఉన్నతస్థాయి వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను కలుస్తారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కృషిచేస్తున్న జపాన్‌లో ప్రధాని పర్యటన ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి చెప్పారు. ఆ తర్వాత ఆగస్టు 31, సెప్టెంబర్ 1న చైనాలో పర్యటించనున్న ప్రధాని తియాన్జిన్‌లో జరిగే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసే బాంక్వేట్ విందులో పాల్గొంటారు. సరిహద్దుల్లో గల్వాన్ ఘటన తర్వాత తొలిసారి చైనా పర్యటనకు వెళుతున్న ప్రధాని పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపుతారు.ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ఒప్పందాలు జరుగుతాయని విదేశాంగశాఖ వెల్లడిరచింది.
ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరిగే ఈ రెండు రోజుల ఎస్?సీఓ సదస్సులో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా 20కిపైగా ప్రపంచ నాయకులు పాల్గొననున్నారు. ప్రస్తుతం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో గ్లోబల్ సౌత్ దేశాల ఐక్యతకు చిహ్నంగా నిలుస్తోంది. మోదీ, పుతిన్‌తో పాటు మధ్య, పశ్చిమ, దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల నేతలకు ఈ ఎస్‌సీఓ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. ఎస్?సీఓ స్థాపన తర్వాత ఇదే అతి పెద్ద సదస్సు కానుందని ఇటీవల చైనా ప్రకటించింది.తొలిసారిగా 2015లో బీజింగ్‌కు వెళ్లిన భారత ప్రధాని ఇప్పటివరకు ఐదుసార్లు ఆ దేశంలో పర్యటించారు. 2019లో చివరిసారిగా చైనాలో పర్యటించారు. ఆ తర్వాత 2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరించేందుకు సైనిక, దౌత్యాధికారుల మధ్య అనేక దఫాల్లో చర్చలు జరిగ్గా ఇటీవలే కొంత పురోగతి కనిపిస్తోంది.ఇక 2024లో రష్యాలో జరిగిన బ్రిక్స్? సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్?పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్?తో ప్రధాని మోదీ కలిసి ఒక వేదికపై చివరిసారిగా కనిపించారు. ఆ సయమంలో ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాల నేతలు రష్యాకు దూరంగా ఉన్నారు. ఇటీవల భారత్-చైనా-రష్యా మధ్య త్రైపాక్షిక చర్చలు త్వరలో జరగాలని మాస్కో ఆశిస్తున్నట్లు దిల్లీలోని రష్యా దౌత్యవేత్తలు సంకేతాలు ఇచ్చారు.