అమెరికాలో మన విద్యార్థులపై మరో పిడుగు

` వీసా నిబంధనలు సవరిస్తున్న అగ్రరాజ్యం
– ఇకపై అమెరికాలో నాలుగేళ్ల వరకే!
– వీసాలపై ఎన్నాళ్లయినా అమెరికాలో ఉంటామంటే కుదరదని చెప్పిన హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం
అమెరికాలో చదువుకునేందుకు ప్రయత్నిస్తున్న, ఇప్పటికే అక్కడే ఉంటున్న విదేశీ విద్యార్థులు మీద ట్రంప్‌ సర్కార్‌ మరో పిడుగు వేసింది. ఇప్పటికే వీసాల జారీకి సోషల్‌ మీడియా వెట్టింగ్‌?ను కఠినంగా అమలు చేస్తోన్న అమెరికా, తాజాగా మరో మార్పు తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తోంది. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్‌ విజిటర్లు, మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాలకు పరిమిత కాల గడువు విధిస్తూ ప్రతిపాదనలను తీసుకురానుంది. అంటే ఇకపై విదేశీ విద్యార్థులు నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండకుండా వీసా నిబంధనల్లో మార్పులు తీసుకొస్తోంది.ప్రస్తుతం ఎఫ్‌-1 వీసాలపై అగ్రరాజ్యంలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, జే-1 వీసాలపై వచ్చిన ఎక్స్ఛేంజ్‌ విజిటర్లకు ‘డ్యూరేషన్‌ ఆఫ్‌ స్టే’ సదుపాయం ఉంది. అంటే వారు ఎంతకాలం చదవాలనుకుంటున్నా లేదా ఇంటర్న్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలని అనుకుంత కాలం అమెరికాలో ఉండొచ్చు. ఎక్స్ఛేంజ్‌ విజిటర్స్‌గా వచ్చే విద్యార్థులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, స్పెషలిస్ట్‌లు, ట్రైనీలు, ఇంటర్న్‌లు, ఫిజీషియన్లకు కూడా ఈ వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఈ ఫ్లెక్సిబుల్‌ స్టూడెంట్‌ వీసా సిస్టమ్‌లో మార్పులు చేసేందుకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం సిద్ధమైంది. అంతేకాకుండా గడువు విధించేలా ‘పరిమిత కాల నివాస అనుమతి’తో కూడిన వీసాలను మంజూరుచేయాలని ప్రతిపాదించింది.‘విదేశీ విద్యార్థులు, ఇతర వీసాదారులు అమెరికాలో నిరవధికంగా నివసించేలా చాలా కాలంగా అమెరికాలోని గత ప్రభుత్వాలు అవకాశం ఇచ్చాయి. దీని వల్ల భద్రతాపరమైన ఇబ్బందులతో పాటు అమెరికన్లకు ప్రయోజనాలపై భారీగానే దెబ్బపడిరది. అందుకే దీనికి ముగింపు పలికేలా కొత్త నిబంధనలను తీసుకొస్తున్నాం. కొన్ని రకాల వీసాదారుల నివాస అనుమతులపై పరిమితి ప్రతిపాదించాం. దీనివల్ల ఫెడరల్‌ ప్రభుత్వంపై భారం తగ్గనుంది’ అని హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం తమ నోటీసుల్లో తెలిపింది.