తెలుగు రాష్ట్ర పార్టీల దారెటు..?
తెలుగువాడంటూ వెంకయ్య నాయుడికి మద్దతు ఇచ్చిన టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ ఏమంటారు?
అభ్యర్థి రాజకీయ పార్టీ సభ్యుడు కానప్పుడు అభ్యంతరమేలా?
యూరియాకు జస్టిస్ బీఎస్ రెడ్డికి ఏమైనా లింకుందా?
ఇకపై భవిష్యత్తులో తెలుగువాడి ఆత్మగౌరవం నినాదం వాడబోరా?
జనంసాక్షి ప్రత్యేక ప్రతినిధి, ఆగస్ట్ 28 : ఆయన దేశం గర్వించదగ్గ న్యాయ శాస్త్రవేత్త.. సమాజానికి ఎన్నో వెలుగుదారులు చూపిన మార్గదర్శి.. రాజకీయాలు, పార్టీలకతీతంగా రాజ్యాంగపు విలువలూ, హక్కులను ప్రజలందరికీ పారదర్శకంగా అందించేందుకు ఐదు దశాబ్దాలపైగా సేవలందించిన నిపుణుడు. తెలుగు గడ్డ గర్వించదగినవారిలో ఒకరు..! అటువంటి నిఖార్సయిన తెలంగాణ తెలుగు బిడ్డను ఉప రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన చారిత్రక సందర్భం గొప్ప అవకాశం. ఇప్పటికే దేశంలోని విద్యావంతులు, మేధావులు ఆయన అభ్యర్థిత్వాన్ని స్వాగతించడం ముదావహం. దరిమిలా నాడు పీవీ నరసింహారావు విషయంలో ఎన్‌టీఆర్ చూపిన వారసత్వానికీ.. మొన్న వెంకయ్యనాయుడి విషయంలో తెలుగు బిడ్డ అనే స్ఫూర్తికీ కట్టుబడిన పార్టీలు, ఇప్పుడు తెలంగాణ తెలుగు బిడ్డకు దక్కిన అవకాశానికి మద్దతు పలకాలనే అభిప్రాయం బలంగా వినబడుతోంది. ప్రత్యర్థితో పోలిస్తే రాజ్యాంగంపై అవగాహనలోనైనా, ఉపరాష్ట్రపతి పదవికి తీసుకొచ్చే హూందాతనం విషయంలోనైనా ఇండియా కూటమి అభ్యర్థి, తెలుగు బిడ్డ, జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అన్ని అర్హతలున్నవారు. ఏ రాజకీయ పార్టీతోనూ, ఎలాంటి రాజకీయాలతోనూ సంబంధం లేని ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక..!
ఓట్ చోరీ ఉదంతాలు బహిర్గతమైన తరుణంలో జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. ఇదొక భావజాల యుద్ధంగా అభివర్ణిస్తున్న నేపథ్యంలో తెలుగు గడ్డ నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో నిలవడం తెలుగు ప్రజల ఆత్మగౌరవమనే భావన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో రాజకీయాలకతీతమైన వ్యక్తిగా ఆయనను బలపరచాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఏకగ్రీవ అంగీకారం తెలపగా.. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి పలు పార్టీల ఎంపీలందరూ తెలంగాణ తెలుగు బిడ్డకు మద్దతు పలకాల్సిన అవసరం ఏర్పడిరది. తెలుగువాడి ఆత్మగౌరవంతో పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఎన్‌టీరామారావు ‘తెలుగు’ సూత్రానికి కట్టుబడ్డారు. 1991లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా నంద్యాల నుంచి పోటీచేసిన పీవీ నరసింహారావుపై పోటీగా నిలబెట్టడం లేదని ప్రకటించి తెలుగువాడి ఆత్మగౌరవమే ముఖ్యమని చాటారు. దేశంలో అత్యున్నత రెండో పదవి ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంలోనూ అడుగడుగునా తెలంగాణను రాజ్యసభలో అడ్డుకున్న వెంకయ్య నాయుడికి బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు తెలిపి తెలుగు గడ్డ ఔన్నత్యాన్ని నిలబెట్టారు. పెప్పర్ స్ప్రే ఘాటును భరించి లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ తెలంగాణ బిల్లును ఆమోదించగా.. తదనంతరం ఆమెపైనే ఎన్‌డీయే అభ్యర్థి వెంకయ్య నాయుడు పోటీలో ఉన్నప్పటికీ తెలుగు బిడ్డని బీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించింది. మరిప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి విషయంలోనూ ఈ ‘తెలుగు’ స్ఫూర్తి వర్తించదా.. తెలుగు అంటే ఒక్క ఆంధ్రాకే చెల్లుతుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
తెలుగువాళ్లు ఏకమవ్వాల్సిన తరుణం
ఏన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థితో పోలిస్తే ఏ రకంగానూ ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తక్కువకాదు. పైగా రాజ్యాంగంపై అవగాహన కలిగి వ్యక్తి. ఈ అత్యున్నత విలువల వారసత్వాన్ని కొనసాగించేందుకు అన్నివిధాలా సమర్థుడైన అర్హుడు. ఈ నేపథ్యంలో తెలుగు గడ్డపై ఉన్న అన్ని పార్టీలు మద్దతు తెలపాలని మేధావులు భావిస్తున్నారు. ఏన్డీయే అభ్యర్థి తమిళ బిడ్డ, తమిళ ఎంపీలందరూ మద్దతు తెలపాలంటూ బీజేపీ పెద్దలే అభ్యర్థిస్తున్నప్పుడు.. తెలుగు ఎంపీలందరూ ఒక్కతాటిపై ఉండి గత వారసత్వాన్ని పునరావృతం చేయాల్సిన బాధ్యత ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు సైతం తెలుగు ప్రజల ఖ్యాతిని పెంచడమే లక్ష్యంగా ప్రకటించుకున్నట్టుగా.. తెలుగు ఉప రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతివ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారంటూ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ధర్మపోరాట దీక్ష చేసిన ఆయన.. ఈ ఎన్నికల్లో తన చిత్తశుద్ధిని చాటుకోవాలని తెలుగు రాష్ట్రాల పౌరసమాజం ఆశిస్తోంది. రాజకీయాలుంటాయ్.. మారుతాయ్.. కానీ తెలుగు బిడ్డ బి సుదర్శన్ రెడ్డికి మద్దతు చరిత్రలో మిగిలిపోయే అంశం. రెండు రాష్ట్రాల్లోని అరవై మంది ఎంపీలు బీఎస్ రెడ్డికి మద్దతిచ్చి ప్రజాస్వామాన్ని బతికించాలని ఇప్పటికే సీఎం రేవంత్ పిలుపునివ్వడం ముదావహం. ఇక బీఆర్‌ఎస్ దారెటో కూడా సమయస్ఫూర్తితో ఆలోచించుకోవాల్సిన తరుణమిది..!