పీసీసీ పీఠం ..మార్పునకు రంగం సిద్ధ

హైదరాబాద్‌, నవంబర్‌ 9 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను పార్టీ పదవి నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే అధిష్టానం ఆయన వద్దనుంచి రాజీనామా పత్రాన్ని సైతం తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. దీనిని బలపరుస్తూ రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ సేకరణ కార్యక్రమం పూర్తయ్యాక పీసీసీ అధ్యక్షుని మార్పు ఉంటుందని రాష్ట్ర పార్టీ వ్యవహారాలు ప్రతినిధి కృష్ణమూర్తి ఇప్పటికే స్పష్టం చేశారు. అదీగాక కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ నేరుగా యుద్ధానికి సన్నద్ధమవుతున్నందున తెలంగాణ ప్రాంతంలో పార్టీ బలహీనపడకుండా ఉండేందుకు వీలుగా ఆ ప్రాంత వ్యక్తినే పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారని కూడా చెబుతున్నారు. ఈ పరిస్థితులను గమనించిన
బొత్స రెండు రోజుల క్రితం విలేకరుల సమావేశం నిర్వహించి తను ఎటువంటి అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని వివరణ ఇచ్చారు. తనకు పార్టీ, ప్రభుత్వ పదవులలో ఏదో ఒక దానినే ఎంచుకొమ్మని అంటే రవాణశాఖ మంత్రి పదవే ఇవ్వమని ఆయన అధిష్టానికి చెప్పినట్ల భోగట్టా. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా బొత్స అవినీతిని ఎండగడుతోంది. ఒకప్పుడు ఎన్నికల కోసం సొంత ఇంటినే అమ్మి వేసేందుకు సిద్ధపడిన ఆయన ఇప్పుడు దాదాపు 30కోట్ల రూపాయలతో ఓ ఎలక్ట్రానిక్‌ మీడియా ఛానల్‌ను ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నిస్తున్నారు. అంతేగాక తన ఆస్తి 3కోట్ల రూపాయలని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న బొత్స దాదాపు 10కోట్ల రూపాయలను తన కుమార్తె పెళ్ళికి ఎలా ఖర్చు చేశారని తెలుగుదేశంపార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు అశోక్‌ గజపతిరజు ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో మద్యం, కంటోన్మెంట్‌ తదితర ప్రాంతాల్లో బొత్స అవినీతి, భూదందాలు అందరికీ తెలిసినవేనని తెలుగుదేశం విమర్శిస్తోంది. బొత్స కుమార్తె పెళ్లిరోజున గ్రామసందర్శన కార్యక్రమాన్ని రద్దు చేశారని, కనీసం తుపాను బాధితులను ఎవరూ పరామర్శించలేదని ఆరోపిస్తున్నారు. ఇవన్నీ విపక్షాల ఆరోపణలని తీసిపారేసినా మరోవైపు దాదాపు ఏడాదిన్నర తర్వాత అతి కష్టం మీద ఆరు జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను,మూడు నగర శాఖలకు కొత్త సారధులను నియమించిన బొత్స వెంటనే ఆయా ప్రాంతాల నుంచి ముఖ్యంగా సీనియర్‌ నేతల నుంచి విమర్శలను చవిచూశారు. ఇప్పటికే తెలంగాణా ప్రాంతీయునికే పీసీసీ అధ్యక్ష పీఠం ఇవ్వాలన్న డిమాండ్‌ మరీ బలంగా వినిపిస్తున్నందున బొత్స మార్పు ఖాయంగాను మారింది. ఆయన చాప కింద నీరులా ముఖ్యమంత్రి పదవి గురించి చేస్తున్న ప్రయత్నాలు అధిష్టానం దృష్టికి వచ్చాయి. తెలుగు తప్ప మరో భాషరాని బొత్స విషయంలో ఇప్పటికే కేంద్రమంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌తో సహా పలువురు వ్యతిరేక నివేదికలు ఇచ్చినందున బొత్సకు పదవీగండం తప్పేలాలేదు. కేవలం కాసులతో పనిచేయించే మనస్తత్వం కలిగిన బొత్స పాలనా పరంగా చేస్తున్న అకృత్యాలు ముఖ్యంగా విజయనగరం జిల్లాలో షాడో మంత్రిత్వపోకడలపై అధిష్టానానికి రహస్య నివేదికలు ఉన్నాయి. ఇవన్నీ ఆయనకు ప్రతికూలాంశాలుగా మారడంలో త్వరలో ఆయనకు అధిష్టానం మంగళం పాడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.