పెళ్లి పేరుతో వంచననిత్యం పెళ్లికొడుకు కోసం అన్వేషణ

ముంబయి, జూన్‌ 30 : అందంగా, వేలవేలకు వేలు సంపాదించే మగువలకు వల వేయడం, అవసరం తీరిన తర్వాత పారిపోవడం అతని నైజం. అతివల జీవితాలతో ఆడుకుంటున్న 30 ఏళ్ల యువకుడిని ముంబయిలోని కేర్వాడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరు విశాల్‌సింగ్‌. పనిపాట లేకుండా జులాయిగా తిరిగే ఈ యువకుడు నిత్యం ఇంటర్నేషనల్‌ కంపెనీలకు చెందిన కాల్‌ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. విధుల ముగించుకొని ఆఫీసు నుంచి బయటకు వచ్చే అందమైన, అతివలను మాటల్లో దించి, వాలతో పరిచయాలు పెంచుకొని పెళ్లి చేసుకుంటాడు. వారికి వచ్చే జీతం డబ్బులు లాక్కొని విలాసాలతో గడపడం విశాల్‌ నిత్యం చేసే పని. పెళ్లి చేసుకున్న అమ్మాయి దగ్గర నుండి డబ్బు చేతికి అందకపోతే ఆమెను వదిలివేయడం, తన మకాం వేరొక చోటకు మార్చేసి మళ్లీ మరొక అమ్మాయికి వల వేయడం ఈయన వెలగబెట్టే పని. తాజాగా ముంబయిలోని కేర్వాడి వీధిలో ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాడు. ఆ ట్యూషన్‌కు వచ్చే 17 ఏళ్ల అమ్మాయికి వల వేశాడు. ఆ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇంటి దగ్గర నుంచి డబ్బు తెప్పించుకునే వాడు. చివరికి ఆ బాలికతో శారీరక సంబంధాలు పెట్టుకున్నాడు. కొన్ని నెలల తర్వాత ఆమె గర్భవతి అయింది. ఈ విషయం తెలుసుకున్న విశాల్‌ అక్కడి నుండి పరారయ్యాడు. చివరకు ఆ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు ఈ అందగాడి పోటోని పట్టుకొని ఆరా తీయగా అసలు గుట్టు బయటపడింది. ఈ బాలికే కాకుండా గతంలో మరో ఐదుగురితోటి వివాహం అయినట్టుగా పోలీసులు గుర్తించారు. పాపం పెళ్లయిన ఆ యువతులు తమ జీవితాలు బహిరంగ పర్చుకోలేక గుట్టుగా ఉండిపోయారు. ఈ సందర్భంగా కేర్వాడి సీనియర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అద్వుత్‌ చవాన్‌ మాట్లాడుతూ చూడడానికి చాలా స్మార్ట్‌గా అందంగా కనిపించే విశాల్‌ వల్ల నష్టపోయిన వారు తమ వద్దకు వస్తే తగిన న్యాయం చేస్తామని అంటున్నారు. ఉద్యోగినులు పగలంతా కష్టపడి సంపాదించిన సంపాదనను ఇలాంటి జులాయిలకు అప్పగించి మోసపోతున్నారని, ముఖ్యంగా బహుళజాతి కంపెనీలలోనే ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని అంటున్నారు. ఇకపై విశాల్‌ లాంటి జులాయిల మాటలతో మోసపోవద్దని ఇన్‌స్పెక్టర్‌ కోరారు. ఈ మేరకు పోలీసులు విశాల్‌ ఫోటోను విడుదల చేశారు.