ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున్న ఉద్యమం: వీరయ్య

నిజామాబాద్‌: రాష్ట్రంలో ప్రజా సమస్యలపై వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్లు  సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌, వీరయ్య నిజామాబాద్‌లో వెల్లడించారు. ప్రజలు సమస్యలతో సతమతమవుతోంటే ముఖ్యమంత్రి మాత్రం తన పదవిని  కాపాడుకునేందుకు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయన్నారు. విద్యుత్‌ సంక్షోభాన్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల పరిశ్రమలు మూతపడే ప్రమాదం ముంచుకొచ్చిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. ప్రజా సమస్యలపై వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టబోయే ఉద్యమంలో అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన కోరారు.