ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష : సీఎం

శ్రీకాకుళం, జూలై 27 : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం దారిద్య్రరేఖ నుంచి బయటపడి అభివృద్ధి చెందాలన్నదే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు జిల్లా పర్యటనలో భాగంగా పాలకొండలో స్వయం శక్తి సంఘాలతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళా గ్రూప్‌లతో ఏర్పాటైన ఆరోగ్యం, పోషణ, పౌష్టికాహారం తదితర విభాగాలతో ఆయా సంఘాల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాల గురించి సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సంఘాలు మరింత అభివృద్ధి చెందాలంటే ఎలాంటి కార్యక్రమలు చేపడితే బాగుంటుందన్న వివరాలు కూడా ముఖ్యమంత్రి మహిళా సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇందిర క్రాంతి పథం ప్రవేశపెట్టిన తరువాత మహిళల్లో ఆత్మవిశ్వాసం, ఆత్యస్థైర్యం పెరిగిందని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్వయం శక్తి సంఘాల గ్రూప్‌లు ఏర్పాటు అయిన దరిమిలా కోటి 10లక్షల కుటుంబాలు దారిద్య్ర రేఖ నుంచి బయటపడినట్లు ప్రపంచ బ్యాంకు గుర్తించిందన్నారు. మహిళా సంఘాలు మరింత అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో సోనియా గాంధీ వడ్డీ లేని రుణాలు అందించే ఏర్పాటు చేసిందని అన్నారు. స్త్రీనిధి కింద ఈ ఏడాది 13వేల కోట్ల రూపాయల రుణాలను మహిళ సంఘాలకు ఇవ్వగా వాటికి వడ్డీగా 16వందల కోట్ల రుపాయల ప్రభుత్వం భరించిందని అన్నారు. అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కొండ్రు మురళీ, ఎంపీ కృపారాణి, ఎమ్మెల్సీ విశ్వప్రసాద్‌, ఎమ్మెల్యేలు సత్యవతి, జగన్‌నాయక్‌, కె.భారతీ తదితరులు ఉన్నారు.