బయ్యారంలో ఉక్కు పరిశ్రమను స్థాపించాలి

ఖమ్మం, జూలై 10 : ఖమ్మం జిల్లా బయ్యారం ప్రాంతంలో గనుల లీజును రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ జాతీయ కార్యవర్గ మాజీ సభ్యుడు నాగేశ్వరరావు స్వాగతించారు. జిల్లాలో నిరుద్యోగ యువజనులకు ఉపాధి కల్పించేందుకు బయ్యారంలో ఉక్కు పరిశ్రమను స్థాపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఖమ్మం పురపాలక సంఘాన్ని నగర పాలక సంస్థగా మార్పుచేసే విషయంలో పాలకులు, స్థానిక అధికార యంత్రాంగం చేస్తున్న జాప్యాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వైఎస్‌ఆర్‌, ఆయన బంధువులకు అక్రమంగా కట్టబెట్టిన గనుల లీజులను రద్దు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో దశలవారి ఆందోళనలు చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజాపోరాటాలకు తలొగ్గిన ప్రభుత్వం పరిశ్రమ ఏర్పాటులోను చొరవ తీసుకోవాలన్నారు. ఒంగోలు, చిత్తూరు నగర పాలక సంస్థగా అంగీకారం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందే ప్రతిపాదనలు పంపినా కూడా ఖమ్మం విషయంలో మాత్రం మీనామేషాలు లెక్కిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార, ప్రధాన ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విషయంలో మాత్రం వెనకబడి ఉంటున్నారు.