బెల్టు దుకాణాలపై మహిళల దాడి

విజయవాడ, ఆగస్టు 1 : మద్యం బెల్టుషాపులపై మహిళలు దాడి చేశారు. మద్యం సీసాలను పగులగొట్టి బీభత్సం సృష్టించారు. నందిగామ మండలం దామలూరు గ్రామంలో మంగళవారం మహిళలు విజృంభించారు. గ్రామంలో అనధికారికంగా వెలిసిన బెల్టు దుకాణాలను తొలగించమని ఎక్సైజ్‌ శాఖను ఎన్ని సార్లు వేడుకున్నా ఫలితం లేకపోవడంతో వారే నేరుగా రంగంలోకి దిగారు. ఈ ఉదయానే పెద్ద సంఖ్యలో డ్వాక్రా గ్రూపు మహిళలు ఊరేగింపుగా బయలుదేరి బెల్టు షాపులపై విరుచుకుపడ్డారు. దాదాపు 40వేల రూపాయలు విలువ చేసే మద్యం సీసాలను పగులగొట్టారు. మద్యం దుకాణాల నిర్వహకులను పరుగులు పెట్టించారు. దీంతో ఎక్సైజ్‌ అధికారులు, స్థానిక పోలీసులు రంగప్రవేశం చేసి మహిళలకు సర్దిచెప్పారు. రెండు రోజుల్లో ఈ మద్యం దుకాణాలు తొలగిస్తామని వారు హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు.