బ్యాంకు అధికారులు సహకరించాలి
విజయవాడ, జూలై 31 : రైతులకు ఖరీఫ్ పంట రుణాలను మంజూరు చేసేందుకు కేటాయించిన లక్ష్యాలను సాధించేలా బ్యాంకు అధికారులు సహకరించాలని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ ఎం.జానకి అన్నారు. రైతులకు ఖరీఫ్ పంట రుణాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు రుణాల మంజూరుపై మంగళవారం ఉదయం స్థానిక సబ్ కలెక్టర్ సమావేశమందిరంలో బ్యాంకు అధికారులతో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ జానకి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో 1415.79 కోట్ల రూపాయలు ఖరీఫ్ పంట రుణాలు రైతులకు మంజూరు చేసేందుకు వివిధ బ్యాంకులకు లక్ష్యాన్ని నిర్దేశించటం జరిగిందన్నారు. ఇప్పటివరకు వివిధ బ్యాంకుల ద్వారా 1051.75 కోట్ల రూపాయలు పంట రుణాలుగా మంజూరు చేయటం జరిగిందని, ఇందుకు సహకరించిన బ్యాంకు అధికారులను అభినందిస్తూ పూర్తిస్థాయి లక్ష్యాలను సాధించేలా కృషి చేయాలని కోరారు. అర్హత కలిగిన ప్రతి కౌలుదారు రైతుకు రుణాలను మంజూరు చేసి రైతులకు ఆర్థిక చేయూత అందించాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులపై ఉందన్నారు. రైతులకు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయటంతో పాటు గత రుణాలను తిరిగి చెల్లించేలా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు సంబంధిత నివేదికలను సమర్పించాలని జానకి అధికారులకు సూచించారు. సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ ఆర్‌వి నరసింహారావు, ఆర్‌బిఐ ఎజిఎం ఎఎస్‌వి కామేశ్వరరావు, నాబార్డు ఎజిఎం ఎన్.మధుమూర్తి, వ్యవసాయ శాఖ జెడి కెఎస్‌కె ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.