భిక్షాటన చేసిన విఆర్ఏలు.

భిక్షాటన చేస్తున్న విఆర్ఏలు.
బెల్లంపల్లి, సెప్టెంబర్27,(జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలో విఆర్ఏలు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి 65 వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా వారు మండల కేంద్రంలో భిక్షాటన చేపట్టారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, వీధి వీధిలో తిరుగుతూ భిక్షాటన చేశారు. ఈసందర్భంగా విఆర్ఏల సంఘం రాష్ట్ర నాయకుడు దుర్గం శ్రీనివాస్ మాట్లాడుతూ గత 65 రోజులుగా సమ్మె చేపట్టినా ప్రభుత్వం స్పందించక పోవడం బాధాకరం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయ అతిముఖ్య పండగ అయిన బతుకమ్మ, దసరా పండగలు చేసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. గత మూడు నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ దుర్భరంగా మారిందని, తాము అసెంబ్లీలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే సమ్మె చేస్తున్నామని, అంతేకాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ఇబ్బందులు తేవడం లేదన్నారు. అనంతరం నేతకాని సంఘం రాష్ట్ర నాయకులు జాడి నర్సయ్య మరియు ఇతర నాయకులు విఆర్ఏలకు మద్దతు తెలిపారు. ఈకార్యక్రమంలో మండలంలోని విఆర్ఏలు పాల్గొన్నారు.