మళ్లీ పోరుబాటలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ

నవంబర్‌1 తెలంగాణ విద్రోహ దినం
ఉద్యోగులపై కేసులు ఎత్తివేయాలి
10వ వేతన సవరణ సంఘాన్ని వేయండి
ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ దేవీప్రసాద్‌
హైద్రాబాద్‌, అక్టోబర్‌ 25(జనంసాక్షి): నవంబర్‌1ని తెలంగాణ విద్రోహ దినంగా పాటించాలంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ దేవీప్రసాద్‌ పిలుపునిచ్చారు. గురువారం జరిగిన తెలంగాణ ఉద్యోగ సంఘాల సమావేశంలో దేవీప్రసాద్‌ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ జరిగిన నవంబర్‌1ను తెలంగాణ విద్రోహ దినంగా పాటించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా గత సంవత్సరం నిర్వహించిన సకలజనుల సమ్మె కాలం నుండి ఈ మధ్య కాలంలో నిర్వహించిన తెలంగాణ మార్చ్‌ వరకూ ఉద్యోగ సంఘాల నేతలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 10వ వేతన సవరణ సంఘం వేయాలని గత 3 నెలలుగా రాష్గ్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా డిమాండ్ల సాధన కొరకు ఆందోళన కార్యక్రమాలను నిర్వహిం చినున్నట్లు ఆయన ప్రకటించారు. నవంబర్‌9న ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా, 1న అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనునట్లు పేర్కొన్నారు. అప్పటికీ దిగిరాకపోతే డిసెంబర్‌ 2వ వారంలో ఛలో హైద్రాబాద్‌ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడిం చారు. 10వ వేతన సవరణ సంఘం వేయాలని, ఉద్యోగదారులందరికీ ఆరోగ్య కార్డులివ్వాలని, కరువు భత్యం చెల్లించాలని, తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉద్యోగ సంఘాలనేతలపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తమ డిమాండ్‌లతో కూడిన పత్రాన్నిఈ నెల 27న సీఎస్‌కు నోటీస్‌ ఇవ్వనున్నట్లు నిర్ణయించామని తెలిపారు.