మహాధర్నాకు తరలిరండి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 12 : కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో సామాన్య, కార్మిక వర్గాలను కష్టాల్లోకి నెట్టుతుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం  విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికులను కనీస వేతనాలు, ఉద్యోగ, సాంఘిక భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 26, 27 తేదీల్లో ఢిల్లీలో మహా ధర్నాను చేపట్టామని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగులు కార్మికులకు భద్రత కరవు అయిందని అన్నారు. అడ్డు అదుపు లేకుండా  పెరుగుతున్న ధరలతో సామాన్యాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న  అక్రమాలు, కుంభకోణాలను అరికట్టడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఉద్యోగ భద్రతతోపాటు కనీస వేతనాలు అమలు చేయాలని ఢిల్లీలో చేపట్టిన మహా ధర్నాకు జిల్లా నుండి పెద్ద ఎత్తున కార్మికులు హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.