ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో

విజయవాడ, జూలై 27 : మసీదు సమీపంలో వైన్‌షాపు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ముస్లిం సంఘాలు ఉయ్యూరులో రాస్తారోకో నిర్వహించాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటీవల జరిగిన దుకాణాల కేటాయింపులో ఉయ్యూరులో మద్యం దుకాణాన్ని దక్కించుకున్న వ్యక్తులు దాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన ప్రదేశం మసీదుకు దగ్గర్లో ఉందంటూ ముస్లీం సంఘాలు ఆందోళన చేపట్టాయి. అయినప్పటికి నిర్వహకులు వెనక్కు తగ్గకుండా అదే ప్రదేశంలో శుక్రవారం షాపు ప్రారంభానికి ఏర్పాట్లు చేసుకోవడంతో ముస్లీం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దాదాపు రెండువందల మంది మహిళలు రోడ్డుపై బైఠాయించారు. దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ రాస్తారోకో చేయగా ట్రాఫిక్‌నిలిచిపోయింది. ఈ దశలో పోలీసులు రంగప్రవేశం చేసి వారికి సర్ది చెప్పారు. ఎక్స్చేంజ్‌ అధికారులు వచ్చి షాపును పరిశీలించారు. మసీదుకు దగ్గరగా ఉంటే తొలగిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించుకున్నారు.