మెడల్‌ గెలవండి..ప్రమోషన్‌ పొందండి..

క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌
న్యూఢిల్లీ: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోన్న క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఒలింపిక్స్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌, వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌, ఆసియా గేమ్స్‌లలో పతకాలు గెలిచిన ఆటగాళ్లందరికీ ప్రమోషన్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలలో ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుంది. దీనికి సంబందించి ఇవాళ జరిగిన క్యాబినెట్‌ మీటింగ్‌లో చర్చించారు. పతకాలు గెలిచిన క్రీడాకారులకు ప్రమోషన్‌ ఇవ్వాలన్న ప్రతిపాదనకు అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. వ్యక్తిగత టీమ్‌ ఈవెంట్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన వారంతా ఈ ప్రమోషన్‌కు అర్హులుగా నిర్ణయించారు. అలాగే జాతీయ స్థాయిలో రికార్డులు బ్రేక్‌ చేసి ఆటగాళ్లకు కూడా ఇది వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. వీరితో పాటు క్రీడాకారులను మెడల్‌ గెలిచేందుకు తీర్చిదిద్దే కోచ్‌లకు సైతం స్పోర్ట్స్‌ కోటాలో ప్రమోషన్‌ ఇవ్వనున్నారు. ప్రభుత్వం తాజా ప్రతిపాదనలపై పలువురు మాజీ క్రీడాకారులు, కోచ్‌లు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రోత్సాహకాలు ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపుతాయని వ్యాఖ్యానించారు. క్రీడలను కెరీర్గఆ ఎంచుకునేందుకు వెనకడుగు వేస్తున్న వారిలో ఇవి మార్పు తెస్తాయని క్రీడాశాఖ ఆశిస్తోంది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలిచిన క్రీడాకారులకు ఇచ్చే మొత్తాన్ని 50లక్షలకు పెంచారు. ఇటీవలే పెంచిన ఈ మొత్తానికి సంబంధించి క్యాబిన్‌ట్‌లో ఆమోదం లభించింది.

తాజావార్తలు