మోగనున్న బడి గంట..తెరుచుకోనున్న సరస్వతీ నిలయాలు

ఉచితాలతో వీరబాదుడు!

హైదరాబాద్‌, జూన్‌ 11 : మరో 12 గంటల్లో బడి గంట మోగనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల తలుపులు మంగళవారం ఉదయం 9గంటలకు తెరుచుకోనున్నాయి. వేసవి సెలవులు ముగియడంతో అధ్యాపకులు, ప్రధానోపాధ్యాయులు తమ తమ పాఠశాలలకు చేరుకుని సర్వం సిద్ధం చేస్తున్నారు.

హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని 16 మండలాల్లో 802 ప్రభుత్వ స్కూళ్లున్నాయి. సుమారుగా లక్షా 28వేల మంది విద్యార్థులు స్కూళ్లకు రానున్నారు. వీళ్లందరి కోసం పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే దాదాపుగా 5 లక్షల పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసింది. మరో విడతలో మిగిలిన పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా వారం రోజులుగా ప్రభుత్వ అనుమతి లేని పాఠశాలలపై అధికారులు దాడులు చేస్తున్నారు. తాజాగా సోమవారంనాడు కూడా దాడులు జరిగాయి. గుర్తింపులేని పాఠశాలల నిర్వాహకులకు నోటీసులిచ్చారు.

జంట నగరాల్లోని ప్రధాన ప్రాంతాలైన కోఠీ, ఆబిడ్స్‌, నాంపల్లి, దిల్‌సుక్‌నగర్‌, చిక్కడపల్లి, సికింద్రాబాద్‌, సీతాఫల్‌మండి, కూకట్‌పల్లి, కెపిహెచ్‌బి, చందానగర్‌, పటాన్‌చెర్వు, మెహదీపట్నం, లక్డీకాపూల్‌, చార్మినార్‌, మదీనా సెంటరు తదితర ప్రాంతాల్లోని బ్యాగులు, చెప్పులు, పుస్తకాలు, బట్టల  దుకాణాలు నాలుగైదు రోజులుగా విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో కిటకిటలాడుతున్నాయి. సోమవారం కూడా కిక్కిరిసిపోయాయి. తాకిడి ఎక్కువ కావడంతో కొందరు బ్యాగులు, చెప్పుల దుకాణాల నిర్వాహకులు రేట్లు విపరీతంగా పెంచారని కొందరు తల్లిదండ్రులు వాపోయారు. నగరంలోని కొన్ని చెప్పుల దుకాణాల్లో నర్సరీ చదివే బాలుడి షూస్‌ గతేడాది 150 రూపాయలుండగా ఈ ఏడాది 250 రూపాయలు పలుకుతోందని వాపోయారు. అలాగే ఒక పిల్లవాడి పుస్తకాలు కొంటే మరో పిల్లవాడికి పెన్‌ బాక్సు ఉచితమని కొందరు.. వాటర్‌ బాటిల్‌ ఉచితమని మరికొందరు రకరకాల ప్యాకేజీలు పెట్టి మరీ దోచుకుంటున్నారని వాపోయారు. ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలకు అవసరమైన పుస్తకాలు కొంటే ఒక బ్యాగు ఉచితమని ఇంకొందరు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఒక విద్యార్థి 20 నోటు పుస్తకాలు కొంటే ఒక జామెట్రీ బాక్సు ఉచితమని రకరకాల ఆఫర్లు ఇస్తూ పలు దుకాణదారులు దోచుకుంటున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా పలు స్కూళ్ల నిర్వాహకులు తాము సూచించిన దుకాణాల్లోనే యూనిఫారం, పుస్తకాలు కొనుగోలు చేయాలని ఆదేశిస్తున్నారని, దీంతో పిల్లలపై ఖర్చు చేసే బడ్జెట్‌ తడిసి మోపెడవుతోందని వాపోతున్నారు.                                 ఇదేం బాదుడో..!

జూన్‌ నెల అంటేనే భయమేస్తోందని, పిల్లవాడ్ని స్కూలులో చేర్పించాలంటే మరింత వణుకు వస్తోందని, ఫీజుల రూపేణా కొంత, షూస్‌, యూనిఫారం, పుస్తకాలకు మరికొంత, స్కూలు బస్సు, రిక్షాలకు ఇంకొంత.. ఇలా.. ఒక మాదిరి స్కూలులోని నర్సరీ తరగతి గదిలోకి పిల్లవాడ్ని పంపాలంటే సుమారుగా 10వేల నుంచి 15వేల రూపాయల వరకు ఖర్చు వస్తోందని మధ్యతరగతికి చెందిన ఒక సామాన్య ఉద్యోగి వాపోయారు. ఉచితాలతో బ్యాగులు, పుస్తకాలు, బట్టలు, షూస్‌ దుకాణదారులతో మరింత పిండుతున్నారన్నారు. ఇక సామాన్యుల సంగతేమిటని వాపోయారు.