రసవత్తరంగా వ్యాధి కారక సంఘ సమావేశం

రసవత్తరంగా వ్యాధి కారక సంఘ సమావేశం
హాజరైన టైగర్‌ దోమ, మలేరియా దోమ, వరహాలు, విష కీటకాలు, మురుగు కాలువలు
ఎవరిపై ప్రతాపం అన్న అంశంపై దీర్ఘ చర్చ
పేదలకు మినహాయింపు, నాయకులు, అధికారులకు తడాకా చూయించాలి
సమావేశ తీర్మానం
కందుకూరు ్‌, జూలై 11 : స్థానిక ఆర్డీవో కార్యాలయంలో డివిజన్‌ పరిధిలోని వ్యాధికారక సంఘ సర్వసభ్య సమావేశం ఆదివారం రసవత్తరంగా కొనసాగింది. ఈ సమావేశానికి వ్యాధి కారక సంఘ అధ్యక్షులు టైగర్‌దోమ అధ్యక్షత వహించగా కార్యవర్గ సభ్యులైన మలేరియా దోమ, మురుగు కాలువలు, వరహాలు, విష కీటకాలు హాజరయ్యాయి. సమావేశం ప్రారంభం కాగానే టైగర్‌దోమ తనదైన శైలిలో గుయ్యి మంటూ మన సంఘ ప్రతాపం చూపించే సమయం ఆసన్నమైందని వర్షాకాలం ప్రారంభం నుండే మనం మన తడాఖా చూయించాలని గీంకరించి అన్నది. ఈ సందర్భంగా మురుగు కాలువ ఒక్కసారిగా తన మురుగును సభ్యులపై పడే అంత అవేవశంగా వేసి ఈ సారి కొన్ని అంశాలు చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాలని సమావేశం దృష్టికి తీసుకొచ్చింది. స్పందించిన టైగర్‌దోమ మీరు పెట్టదలచిన అంశాలు సమావేశానికి తెలపాలని కోరింది. వెంటనే మురుగు కాలువ ప్రతిసారి పేదవాడల్లోని పేదలపైనే మన ప్రతాపం చూపడం న్యాయం కాదని, మన ఉనికిని ప్రపంచానికి సాటిచెప్తున్న పేదలపై ఈ సారి కొంచెం కనికరిద్దామని మన ప్రతాపాన్ని వారికి అనుకూలంగా మార్చుకుంటున్న రాజకీయ నాయకులు, షో కాల్డ్‌ అధికారులను మన ప్రతాపాన్ని చూపిద్దామని మురుగునీరు వెదజల్లుతూ ఆవేదనగా తన మనసులోని మాట వెల్లడించింది. వెంటనే టైగర్‌దోమ ఏ అంశమైనా నా, నీ నిర్ణయంతో ముడిపడిలేదని సమావేశంలో మెజార్టీ నిర్ణయం ప్రకారం అమలు జరుగుతుందని అన్నది. వెంటనే వరహం లేచి పేదలను మినహాయిస్తే మనసంఘం ఎవరు గుర్తిస్తారని రాజకీయ నాయకులు, అధికారులు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని ఎసిల్లో నివసిస్తుంటారని వారి దరిదాపుల్లోకి వెళ్లే అవకాశం మీకేమో కానీ మా జాతికి మాత్రం లభించదని ఈ నిర్ణయంతో నేనే ఏకీబవించనని గుయ్యిమంటూ రద చేసింది. ఇంతలో మలేరియా దోమ లేచి ప్రతిసారి సీజన్‌లో మన ప్రతాపం అంతా పేదవాడల్లోనే చూయిస్తున్నామని, అందువలన పేదలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వివరించింది. అదేవిధంగా మన ప్రతాపాన్ని ప్రైవేటు వైద్యశాలలు తమ ఖజానాలను నింపుకోవడానికి వినియోగించుకోవడం ఆలోచించదగ్గ విషయం అని అన్నది. ఇంతలో విష కీటకాలు లేచి పేదలకు వైద్యం అందించేందకు ప్రభుత్వ వైద్యశాలలు మండలానికి ఒకటి, డివిజన్‌ పరిదిలో కందుకూరులో వందపడకల వైద్యశాల వైద్యసేవలు అందిస్తున్నాయి కదా మనం జాలి చూపించాల్సిన అవసరం లేదు కదా అని అన్నది. ఈ మాటను ఆవేశంగా లేచిన మురుగు కాలువ ఆసుపత్రి సమీపంలో ఉన్న మా సోదర మురుగు కాలువలను వైద్యశాలల సేవలు, పనితీరును వివరించాయని అన్నది. ఏ వైద్యశాలలో వైద్యులు పూర్తి స్థాయిలో లేరని మందులు అసలుండవని, ఎక్యూట్‌మెంట్‌ అరకొరగా ఉన్నాయని వైద్యశాలకు వైద్యానికి వెళ్లిన పేదలు ప్రాణాలపై ఆశలు వదులుకునేంత దుర్భరంగా దారుణంగా వైద్యశాలల పనితీరు ఉందని అన్నది. అనంతరం అనేక తర్జనలు పడ్డ సభ్యులు చివరికి ఈ సీజన్‌లో పేదవారికి మినహాయింపు ఇవ్వాలని, రాజకీయ నాయకులు, అధికారులకు తమ ప్రతాపం చూపాలని ఏకగ్రీవంగా తీర్మానించాయి. ముఖ్యంగా టైగర్‌ దోమ, మలేరియా దోమ, రాజకీయ నాయకులు, అధికారుల నివాసాల్లోకి వెళ్లి తమ జాతితో ప్రతాపం చూయించి దశాబ్ధంగా పేద వర్గాల ప్రజలు వ్యాధులతో ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలు తెలిసేలా గుర్తు చేయాలని బాధ్యతలు తీసుకున్నాయి.
ఇది వ్యంగ్యం కాదు. నేదు వ్యవస్థలో ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసినా పేద వాడల్లో మురుగునీటి కాలువలు, డ్రైనేజీలు పారిశుద్ధ్యం లేక పేదలు వ్యాధుల బారిన పడుతున్నా, మొక్కుబడిగా ప్రాణాలు పోయిన తదుపరి పర్యటిస్తున్న ప్రజా ప్రతినిథులు, అధికారుల తీరుకు నిదర్శనం మాత్రమే.