రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఉద్యమం ఉధృతం

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఉద్యమం ఉధృతం
తెలంగాణ ఉద్యోగ జేఏసీ

న్యూఢిల్లీ :
రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేత శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల తర్వాతనే ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి ఉండగా, రాష్ట్రపతి ఎన్నికలు వచ్చిపడ్డాయన్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఉద్యమం ఎలా ఉండాలనే విషయాన్ని ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామన్నారు. అంతిమ లక్ష్యాన్ని అందుకునే వరకూ ఉద్యమాన్ని వీడబోమని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే మరోమారు సకల జనుల సమ్మె చేపడతామన్నారు. తుది విడత ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం కావాలన్నారు.