రుణాలు పొందని వారికీ ఇవ్వండి

హైదరాబాద్‌, జూన్‌ 30 : బ్యాంకుల రుణ లక్ష్యంలో 25 శాతం బలహీన వర్గాలు, ఇంత వరకు రుణాలు పొందని రైతులకు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ వరప్రసాద్‌ బ్యాంకర్లకు సూచించారు. గాంధారి మండల కేంద్రంలో దక్కన్‌ గ్రామీణ బ్యాంకు శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో 1000 కోట్లు ఖరీఫ్‌కు, 600 కోట్లు రబీకి పంట రుణాలు అందించడానికి 2012-13 సంవత్సరానికి లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగిందన్నారు. అయితే వడ్డీలేని రుణాలు పొందడానికి రైతులు ఉత్సహంగా ముందుకు రానున్నారని, లక్ష్యాన్ని అధిగమించడం సమస్య కాబోదన్నారు. సాధారణంగా బ్యాంకర్లు ఎక్కువగా పెద్ద రైతులకే రుణాలు అందించడానికి ఇష్టపడుతారని తెలిపారు. ప్రభుత్వం ఎన్నో విధాల ప్రోత్సహిస్తున్నప్పటికీ చిన్న, సన్నకార రైతులు, బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బిసిలు మైనార్టీలు వీటిని అందిపుచ్చుకోవడం అవగాహనాలోపంతో పాటు వారిని బ్యాంకర్లు ప్రోత్సహించకపోవడం వల్ల వారు రుణాలను ఇప్పటికి పొందలేకుండా ఎంతో మంది ఉన్నారన్నారు. ఈ పరిస్ధితులను పరగణనలోకి తీసుకొని మొట్టమొదటి సారిగా జిల్లాలో 25 శాతం రుణాలను వారికే అందించి రాష్ట్రంలో, దేశంలో ఆదర్శంగా నిలువడానికి జిల్లా బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. ప్రతి 2వేల మందికి బ్యాంకు శాఖ ఉండాలన్న ప్రభుత్వ నియమాన్ని బ్యాంకులు ఇప్పటికి ఇంకా అమలు చేయడం లేదన్నారు. జిల్లాలో 9 మండలాల్లో ఎస్‌డిహెచ్‌ బ్యాంకు శాఖలు లేవని చెప్పారు.