వంద సీట్లు దేవుడెరుగు జోడు పదవుల్లో ఒకటివ్వు

పార్టీ అధ్య్ష పదవో.. ప్రతిపక్ష నేతో
పొన్నం డిమాండ్‌
కరీంనగర్‌, జూలై 9 (జనంసాక్షి) :
‘వంద సీట్లు ఇవ్వడం దేవుడికెరుక.. ముందు ఉన్న జోడు సీట్లలో ఒకటి బీసీలకిచ్చి చిత్తశుద్ధి నిరూపించుకో’ అంటూ చంద్రబాబును కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మలేమని ఎద్దేవా చేశారు. ఆయన ఎప్పుడు, ఎందుకు తన వైఖరిని మార్చుకుంటాడో తెలియదని పొన్నం వెల్లడించారు. బాబు చేసిన వంద సీట్లు, 10 వేల కోట్ల ప్రకటనను స్వాగతిస్తున్నామని కానీ, ఆయన మాటలపైనే తమకు నమ్మకం లేదన్నా రు. 30 ఏళ్ల పార్టీ చరిత్రలో ఏనాడూ బీసీలకు తమ పార్టీ జోడు పదవుల్లో ఒకటివ్వని బాబు ఈ ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ముందు టీడీపీ అధ్యక్ష పదవో లేదా ప్రతిపక్ష పదవో బీసీకి ఇస్తామని ప్రకటిస్తే అప్పుడు బీసీలు ఆలోచిస్తారని తెలిపారు. తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తున్న టీడీపీ, ఇప్పుడు బీసీ జపం చేస్తే ఆ సామాజిక వర్గ ప్రజలు నమ్మరని పొన్నం అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బీసీలు కరుణించాలన్నా, ముందు ప్రత్యేక రాష్ట్రంపై కచ్చితమైన ప్రకటన చేయాలని ఎంపీ డిమాండ్‌ చేశారు.