వేలంపాట అధికారం పర్ణశాల పంచాయితికే

ఖమ్మం, అక్టోబర్‌ 19 : పర్ణశాల పార్కింగ్‌ వేలంపాటపై వివాదం న్యాయస్థానం తీర్పుతో ముగిసింది. ఇటీవల గ్రామపంచాయితీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించగా కారం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి సుమారు లక్షా ఐదువేలకు వేలంపాట దక్కించుకున్నారు. ఈ వేలంపాటపై వచ్చిన ఆదాయంలో సగం ఆదాయం సీతారామచంద్ర దేవస్థానానికి  చెందుతుందని ఆ శాఖ అధికారులు కోర్టు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి గ్రామ పంచాయితీ అధికారులు కౌంటర్‌ దాఖలు చేశారు. 3నెలల వాదనల అనంతరం పర్ణశాల పార్కింగ్‌పై పూర్తి స్థాయి అధికారం పర్ణశాల పంచాయితీకే చెందుతుందని తీర్పు ఇచ్చారు. దేవస్థానానికి ఎలాంటి ఆదాయ వనరులు చెల్లించాల్సిన అవసరం లేదని హైకోర్టు తీర్పు వెల్లడించినట్లు పంచాయితీ అధికారులు తెలిపారు.