వైఎస్సార్‌, జగన్‌ ఇద్దరూ తెలంగాణ ద్రోహులే : ఈటెల

కరీంనగర్‌్‌, మే 27 (జనం సాక్షి) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, అతని కుమారుడు జగన్మోహన్‌రెడ్డి ఇద్దరూ తెలంగాణ ద్రోహులేనని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును రాజశేఖర్‌రెడ్డి అడ్డుకుంటూ రాకుండా చేయడమే కాకుండా తెలంగాణ ఉద్యమాన్ని, టీఆర్‌ఎస్‌ పార్టీ అడుగడుగున అణచివేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తండ్రి బాటలోనే తనయుడు జగన్‌ పార్లమెంట్‌లో సమైక్యవాదానికి జైకొడుతూ ప్లకార్డులు ప్రదర్శించి తెలంగాణ వాణిని వినిపించ కుండా అడ్డుపడ్డారని, తండ్రీకొడుకులిద్దరూ తెలంగాణ ద్రోహులేని రాజేందర్‌ పేర్కొన్నారు. అందుకే జగన్‌ మానుకోట ఓదార్పు యాత్రను తెలంగాణ ప్రజలు అడ్డుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జగన్‌పై తెలంగాణ ప్రజలకు ఉన్న వ్యతిరేకతకు మానుకోట ఘటనే ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. ఆ సందర్భంగా జగన్‌ను అడ్డుకునేందుకు మానుకోట రైల్వే స్టేషన్‌కు వేలాదిగా తరలి వచ్చిన తెలంగాణ ప్రజలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కొండా మురళీధర్‌రావు, సురేఖ తదితరులు దాడులకు తెగబడ్డారని, విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో అనేక మంది గాయపడ్డారన్నారు. దీనికి ప్రతిగా నిరాయుధులైన తెలంగాణవాదులు అక్కడి రైల్వే ట్రాక్‌పై ఉన్న రాళ్లనే తమ ఆయుధాలుగా మల్చుకుని వాటితోనే సీమాంధ్రులను, తెలంగాణ వ్యతిరేకులను తరిమి కొట్టారన్నారు.మానుకోట ఘటనకు రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సోమవారం సీమాంధ్రులను, తెలంగాణ వ్యతిరేకులకు తరిమికొట్టేందుకు ఉపయోగించిన అప్పటి రాళ్లకు తెలంగాణ ప్రజలు పూజలు నిర్వహించనున్నారన్నారు. జగన్‌ అండ చూసుకుని పరకాలలో ఆ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర్‌రావు గూండాయిజం చెలాయిస్తున్నారని రాజేందర్‌ ఆరోపించారు. రాయలసీమ ఫ్యాక్షనిజం, గూడాయింజం పరకాలలో చెలాయించి ఓట్లు దండుకోవాలని ‘కొండా’ దంపతులు ప్రయత్నిస్తున్నారని, పరకాలలో వీరి ఆటలు సాగబోవని, పిచ్చివేషాలు వేస్తే పరకాల మరో మానుకోట అవుతుందని రాజేందర్‌ హెచ్చరించారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలైన టీడీపీ,కాంగ్రెస్‌, వైఎస్సార్‌ సీపీలతోపాటు కాకినాడ తీర్మానాన్ని తుంగలో తొక్కిన బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు పరకాల ఓటర్లు సిద్ధంగా ఉన్నారని, ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు రూపాయి ఖర్చుపెట్టి వేల కోట్ల రూపాయలు వెనుకేసుకున్నారని ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. ఆయన వారసత్వాన్నే కొనసాగిస్తూ జగన్‌ లక్షల కోట్లలో అక్రమాస్తులు కూడబెట్టారని, అవినీతి, అక్రమాలతో తెలంగాణ సంపదను దోచుకున్న జగన్‌ నీతులు వల్లెవేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు సర్దార్‌ రవీందర్‌సింగ్‌, గుంజపడుగు హరిప్రసాద్‌, బెజుగం మధు,చంద్రం తదితరులు పాల్గొన్న