శ్రీవారి సేవలో మంత్రి సుదర్శన్ రెడ్డి
తిరుమల, ఆగస్టు 1 : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి సుదర్శన్‌రెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో బుధవారం మధ్యాహ్నం తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు స్థానిక పద్మావతి అతిథి గృహాల సముదాయం వద్ద టిటిడి సూపరింటెండెంట్ మోహన్‌బాబు స్వాగతం పలికి బస ఏర్పాటు చేశారు. మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి 8గంటల సమయంలో శ్రీవారికి నివేదించే నైవెద్య విరామ సమయంలో ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేశారు. దర్శనం చేసుకున్న తరువాత హుండిలో మంత్రి కానుకలు సమర్పించుకున్నారు. ఆలయంలోని రంగనాయక మండపంలో మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను వేదపండితులు ఆశీర్వదించారు. ఆలయ డిప్యూటీ ఇఒ మునిరత్నం రెడ్డి స్వామి వారి ప్రసాదం, తీర్థం మంత్రికి అందించారు. మంత్రి ఆలయం వెలుపల మిడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చానని తెలిపారు. రాజకీయ విషయాలు ఇప్పుడు మాట్లాడటం సరైనది కాదని అన్నారు. రాత్రికి పద్మావతి గృహ సముదాయంలో బస చేశారు. గురుపౌర్ణిమి సందర్భంగా స్వామి వారిని దర్శించుకునేందుకు మంత్రి ఆయన కుటుంబ సభ్యులకు గురువారం తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామికి నిర్వహించే అర్చన సమయంలో మరో మారు స్వామి వారి దర్శనం కల్పించినట్టు మునిరత్నం రెడ్డి తెలిపారు.