పోటెత్తిన పుల్లెంల
` పోరుబిడ్డ పాక హనుమంతుకు కన్నీటి వీడ్కోలు
` వేల సంఖ్యల్లో తరలివచ్చిన ప్రజలు
` భారీ బందోబస్తు మధ్య అంతిమయాత్ర
చండూరు, డిసెంబర్ 28 (జనంసాక్షి):మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ గణేష్ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన స్వగ్రామమైన చండూరు మండలం పుల్లెంల గ్రామానికి ఆదివారం గణేష్ మృతదేహం చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. మాజీ మావోయిస్టులు, పౌర హక్కుల సంఘం నేతలు, విప్లవ రచయితల సంఘం ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 25న ఒడిస్సా ఎదురు కాల్పుల్లో మృతి హనుమంతు మృతిచెందిన విషయం విదితమే.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ గణేశ్ బూటకపు ఎన్ కౌంటర్ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. అంతిమయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీ.జే.పీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో బూటకపు ఎన్ కౌంటర్లకు పాల్పడుతోందన్నారు. అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారని మండిపడ్డారు. ఆపరేషన్
కంగార్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల
పాక హనుమంతు మృతదేహానికి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ… చదువుకునే రోజుల్లో నల్లగొండ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో నాకు జూనియర్‌గా హనుమంతు ఉన్నాడని తెలిపారు. హనుమంతు నేను విద్యార్థి సంఘంలో పనిచేశామని గుర్తు చేసుకున్నారు. పీడిత ప్రజల కోసం తుది శ్వాస విడిచే వరకు కృషిచేసిన గొప్ప మహానీయుడని కొనియాడారు. బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ కంగార్ పేరుతో నక్సలైట్లను నిర్మూలించేందుకు చేపట్టిన చర్యలను మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఖండిరచారు. పేద ప్రజల కోసం పనిచేస్తున్న మావోయిస్టులను అరెస్టు చేసి జనజీవన స్రవంతిలో కలిపే విధంగా కృషి చేయాలి తప్ప ఎన్‌కౌంటర్లు చేసి ప్రాణాలు తీయడం సబబు కాదన్నారు. యావత్తు ప్రజానీకం కోసం పనిచేసిన నాయకులు ఎప్పటికీ తమ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.


