కొండల్ని మింగే అనకొండలు మన పాలకులు
ఆరావళి ఆర్తనాదాలతో ఎగిసిపడ్డ నిరసన జ్వాలలు
ప్రకృతి సంపదను కొల్లగొట్టి.. కోట్లు కూడగట్టి..
అడవులు, గుట్టలను కనుమరుగుచేస్తున్న ఆధునిక దోపిడీ
మైనింగ్ మాఫియా, కార్పొరేట్ల చేతుల్లో కీలుబొమ్మల్లా ప్రభుత్వాలు
సహజ వనరుల రక్షణ కోసం తరలివస్తున్న సామాన్యులు
స్థానికులు సహా గొంతుకలుపుతున్న సోషల్ మీడియా సైనికులు
జనంసాక్షి ప్రత్యేక ప్రతినిధి (డిసెంబర్ 28)
అగ్గిపుల్ల, సబ్బుబిల్లా, కుక్కపిల్లా కాదేదీ కవితకనర్హం అనే శ్రీశ్రీ పంక్తిని పాలకులు పుణికిపుచ్చుకున్నారో ఏమోగానీ.. అడవులు, గుట్టలు, కొండలు, పర్వతాలు, చెట్టూచేమలూ అన్నతేడాలేకుండా మింగేస్తున్నారు. స్లో పాయిజన్ ఎక్కించినట్టుగా క్రమక్రమంగా ప్రకృతి విధ్వంసానికి తెరతీస్తున్నారు. చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా, సమస్త ప్రాణికోటికి రక్షక కవచాలుగా ఉన్నటువంటి వనరులనూ ఒక్కొక్కటిగా చెరబడుతున్నారు. కార్పొరేట్ల చేతుల్లో కీలుబొమ్మలా మారి అభివృద్ధి పేరిట ఆధునిక దోపిడీకి పూనుకుంటున్నారు. చెమ్మగిల్లుతున్న చెట్లూ.. గుండెలవిసేలా గుట్టలూ.. పర్వతాల హాహాకారాలూ ఇవేవీ పట్టని పాలకులు.. మైనింగ్ మాఫియాకు సకల అనుమతులిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతున్న తరుణంలో ఆర్తనాదాలు పెడుతున్న ఆరావళి పర్వతశ్రేణులపై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనమిది..!
మావోయిస్టులు, ఆ పార్టీ అగ్రనేతల హత్యాకాండ దరిమిలా బొగ్గు విస్తరణ పూనుకున్న మైనింగ్ మాఫియాపై ఆదివాసీలు పెద్దఎత్తున తిరగబడ్డ ఉదంతం ఇటీవల చర్చనీయాంశమైంది. చత్తీస్‌గడ్ రాష్ట్రం అంబికాపూర్‌లో బొగ్గు విస్తరణకు వ్యతిరేకంగా వేలాదిమంది ఆదివాసీలు ఘటనా స్థలానికి వెళ్లి పోలీసులకు ఎదురు నిలిచారు. లాఠీచార్జి, టియర్ గ్యాస్‌ను లెక్కచేయకుండా తమ రక్షణ కోసం ప్రతిగా రాళ్ల దాడులకు దిగారు. మూడువారాల క్రితం జరిగిన ఈ ఘటన పెద్దగా వెలుగుచూడకపోయినప్పటికీ.. తాజాగా ఆరావళి పర్వతాల విషయమై కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర నిరసన వ్యక్తమైంది. దశాబ్దాలుగా అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్, అటవీ నిర్మూలన వల్ల ఆరావళి పర్వతాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. రాజస్థాన్, హర్యానాలో డజన్ల కొద్దీ కొండలు పూర్తిగా కనుమరుగయ్యాయి. పేలుళ్లు, ధూళి కాలుష్యం, భూగర్భ జలాల క్షీణత ఇవన్నీ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత పురాతన పర్వతాలు ప్రమాదంలో పడ్డాయని స్థానికులు, దేశంలోని పర్యావరణ ప్రేమికులు ఆందోళన బాట పట్టారు.
నాలుగు రాష్ట్రాలకు రక్షణ
ఆరావళి పర్వతాలు – ప్రపంచంలోనే అతి పురాతనమైన మడత పర్వత శ్రేణులు. ఈ పర్వతాలు ఢల్లీి నుంచి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ వరకు సుమారు 700 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. భారత్ రక్షణగా పెట్టని గోడలా ఉన్నాయి. ఆరావళి పర్వత శ్రేణి లేకుంటే ఉత్తర భారతదేశం ఏడారిలా మారిపోయి ఉండేది. హిమాలయాలకంటే కూడా పురాతణమైంది ఆరావళి పర్వత శ్రేణి. ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నాయని సోషల్ మీడియాలో సేవ్ ఆరావళి అనే హ్యాష్‌ట్యాగ్ పేరిట వైరల్ అయింది. రాజస్థాన్ లక్షలాది మంది ప్రజలు స్వచ్చందంగా ఆందోళనకు దిగారు. సుప్రీంకోర్టు తీర్పు క్రమంలో ఆరావళి పర్వతాలను కాపాడే ఉద్యమం మరింత ఉదృతం అయింది. దేశవాప్యంగా విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. విపక్షాలు సైతం ఆరావళి విధ్వంసాన్ని ఆపాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఆరావళి పర్వతాల్లో అరుదైన, గొప్ప ఖనిజాలు ఉన్నాయి. ఇప్పటికే మైనింగ్ చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణం దెబ్బతినడమే కాదు.. వన్యప్రాణులకు కూడా దిక్కు లేకుండా పోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఇది మరణ శాసనమే అని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ హెచ్చరించారు.
సుప్రీం తీర్పునిచ్చినా..
కేంద్ర ప్రభుత్వ కమిటీ సిఫార్సు మేరకు నవంబర్ 20న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో సేవ్ ఆరావళి ఉద్యమం మరింత ఊపందుకుంది. 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్నవాటిని పర్వతాలుగా చెప్పలేమనే వాదనను సుప్రీం కోర్టు అంగీకరించడం గమనార్హం. దీంతో ఆరావళి పర్వతాల్లో 100 మీటర్ల కంటే (328 అడుగులు) తక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాల్లో మైనింగ్ జరుపుకోవచ్చని కేంద్రం భావించింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆరావళి విస్తీర్ణంలో 90 శాతానికిపైగా రక్షిత ప్రాంతంగానే ఉంటుందని పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. మొత్తం 1.44 లక్షల చ.కి.మీ విస్తీర్ణంలో కేవలం 0.19శాతం పరిధిలోనే తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యంత కఠినమైన నిబంధనలు ఉంటాయని, కొత్తగా ఎక్కడ పడితే అక్కడ మైనింగ్ లీజులు ఇవ్వబోమని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఢల్లీి ప్రాంతంలో మైనింగ్‌పై పూర్తి నిషేధం కొనసాగుతుందన్నారు.
ధ్వంసం చేస్తే వినాశనమే..!!
ఆరావళి పర్వతాల్లో అక్రమ మైనింగ్, అక్రమ కట్టడాలతో పర్యావరణం తీవ్రస్థాయిలో దెబ్బతింటుంది. మైనింగ్‌తో వచ్చే ధూళితో ఎడారి రాష్ట్ర రాజస్థాన్ దుర్భర పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుందంటున్నారు పర్యావరణవేత్తలు. ఎడారీకరణ తీవ్రతరమై దూళి తుఫానులు, నీటి కొరత పెరుగుతాయి. ఈ పర్వతాలు కనుమరుగైతే ఉత్తర భారతదేశం మొత్తం ఇసుక మేటలతో ఎడారిగా మారే ప్రమాదం ఉంది. వేడిగాలులు పెరిగి వర్షాభావ పరిస్థితులు తలెత్తి వ్యవసాయం కుదేలైపోతుంది. ఉష్ణోగ్రతలు హెచ్చి నివాస యోగ్య పరిస్థితులూ మృగ్యమవుతాయి. ఇసుక తుఫానుల వల్ల సారవంతమైన మైదానాలు సాగుకు అనుకూలించకుండా పోతాయి. అందుకే ఆరావళిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
మోడీ గ్లోబల్ టాక్, లోకల్ టాక్ డిఫరెంట్ : జైరాం రమేష్, కాంగ్రెస్ నేత
కాలుష్య ప్రమాణాలను సడలించడం, పర్యావరణం, అటవీ చట్టాలను బలహీనపరచడం, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్, పర్యావరణానికి సంబంధించిన ఇతర సంస్థలను నిర్వీర్యం చేయడం వంటివి కేంద్ర సర్కారు చేస్తోంది. పర్యావరణ సమతుల్యతపై మోదీ సర్కార్ దృఢ నిశ్చయంతో దాడి చేసిందనడానికి ఆరావళి పర్వతాలు మరొక ఉదాహరణ. పర్యావరణ సమస్యల విషయానికి వస్తే ప్రధాని మోదీ ప్రపంచ చర్చకు, ఆయన లోకల్ వాక్‌కు మధ్య ఎలాంటి సంబంధం లేదు. అభివృద్ధి పేరుతో ప్రకృతిని బలిచేస్తే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. ఆరావళి రక్షణకు కఠిన చట్టాలు, అటవీ పునరుద్ధరణ అవసరం. పాలకులు పగ తీర్చుకోవడం మాని, ప్రకృతిని కాపాడే బాధ్యత తీసుకోవాలి.
ఐ-బొమ్మ నిర్వాహకుడు రవి కేసులో కీలక పరిణామం
హైదరాబాద్: ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రహ్లాద్ వెల్లేల పేరుతో రవి.. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. అతను తన రూమ్‌మేట్ అని గతంలో పోలీసు విచారణ సందర్భంగా చెప్పాడు. దీంతో బెంగళూరు నుంచి ప్రహ్లాద్‌ను పిలిపించిన పోలీసులు.. కస్టడీలో ఉన్న ఇమంది రవి ఎదుటే అతన్ని విచారించారు. ‘‘ఇమంది రవి ఎవరో నాకు తెలియదు. నా పేరుతో రవి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్టు తెలిసి షాక్ అయ్యా’’ అని ప్రహ్లాద్ పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం అతను బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ప్రహ్లాద్ డాక్యుమెంట్లు ఇమంది రవి దొంగిలించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రేపటితో ఇమంది రవి పోలీసు కస్టడీ ముగియనుంది.


