కాంగ్రెస్ భావజాలం బతికి ఉంటేనే దేశ రక్షణ సాధ్యం
` మత విద్వేష రాజకీయాలతో సమాజానికి నష్టం
` ఉపాధి హామీ పథకాన్ని కనుమరుగు చేసేందుకు బిజెపి కుట్ర
` జనవరి 26న కాంగ్రెస్ జెండా పండుగ
` ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టియు విక్రమార్క
ఖమ్మం(జనంసాక్షి):దేశ రక్షణకు కాంగ్రెస్ భావజాలం ఒక్కటే మార్గం, కాంగ్రెస్ భావజాలం బతికి ఉంటేనే దేశ రక్షణ సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆయన ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశ సంపద, వనరులు దోపిడీకి గురవుతుంటే స్వాతంత్రం తీసుకువచ్చి ప్రజలు స్వేచ్ఛగా బతికేందుకు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన చారిత్రాత్మకమైన రోజు డిసెంబర్ 28 అని డిప్యూటీ సీఎం వివరించారు.ఈ దేశంలో కొన్ని శతాబ్దాలుగా మతాలు, కులాలు ఎలాంటి భేదం లేకుండా కలిసి జీవనం సాగిస్తున్నాయి కొందరు రాజకీయ లబ్ధి కోసం కులాలు మతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు, విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందవచ్చు కానీ అది సమాజానికి తీరని నష్టం చేకూరుస్తుందని డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తూట్లు పొడిచి, పేదలకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఇది సరైన విధానం కాదని హెచ్చరించారు. ఈ దేశ సంపద, వనరులు కార్పొరేట్ వ్యవస్థలకు వ్యక్తులకు పంచడానికి కాదని అన్నారు. గొప్ప ఆశయంతో ఉపాధి హామీ పథకానికి లక్ష కోట్ల బడ్జెట్ ను కాంగ్రెస్ ప్రభుత్వంలో కేటాయిస్తే ఆ పథకాన్ని కనుమరుగు చేసే కుట్ర జరుగుతుంది అన్నారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని ప్రపంచమంతా జాతిపితగా కొలుస్తుంటే స్వాతంత్రం వచ్చి ఆరు నెలలు తిరగకముందే ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం కలిగిన వ్యక్తులు ఆయనను భౌతికంగా నిర్మూలించారు కానీ ఆయన ఆలోచనను నిర్మూలించలేరని డిప్యూటీ సీఎం అన్నారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం, ఈ పథకాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను ఎండగట్టేందుకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇచ్చిన పిలుపుమేరకు పేదల కోసం కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాన పోరాటం ఉదృతం చేస్తుందని డిప్యూటీ సీఎం వివరించారు. ఈ దేశానికి, రాష్ట్రానికి సమాజంలోని అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాలు ఇటువంటి కార్యక్రమాలు చేశాయో వివరించేందుకు జనవరి 26న రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహించాలని డిప్యూటీ సీఎం కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. ఆరోజు ప్రతి ఇంటిపైన కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని వివరిస్తూ కరపత్రాలు పంచాలని, కండువాలు ధరించాలని డిప్యూటీ సీఎం తెలిపారు. అత్యంత ప్రజాస్వామ్య పునాదులపై, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశము ఎదగడానికి కారణమైన అఖిలభారత కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు ఈరోజు అని తెలిపారు.ఆనాటి నుంచి ఈరోజు వరకు పరిపాలనే కాకుండా సామాజిక మార్పునకు కూడా కాంగ్రెస్ పార్టీ పునాదులు వేసింది, అసమానతలు తొలగించి లౌకికవాదం, మహిళా సాధికరత, అంటరానితనం నిర్మూలన, ప్రతి పౌరునికి ఓటు హక్కు, తన ప్రభుత్వాన్ని తనే ఎన్నుకునే అవకాశాలను కల్పించింది కాంగ్రెస్ పార్టీ అలాంటి గొప్ప పార్టీ పుట్టినరోజు ఈరోజు అని డిప్యూటీ సీఎం వివరించారు.దేశం స్వాతంత్రం సాధించిన సమయంలో ఆహారం దొరకక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనీసం గుండుసూది కూడా ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఆ పరిస్థితి నుంచి బయటికి వచ్చి హరిత విప్లవం, శ్వేత విప్లవం ద్వారా పంచవర్ష ప్రణాళికలతో దేశానికి కాదు ప్రపంచానికి ఆహార ధాన్యాలు సరఫరా చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైందని డిప్యూటీ సి ఎం అన్నారు.పేదవాడు ఆత్మగౌరవంతో బతికేందుకు 20 సూత్రాల కార్యక్రమం, జమిందార్లు, జాకిర్దారులు, పెత్తందార్ల చేతుల్లో భూములు పెట్టుకుని పేదలకు నరకయాతన చూపిస్తుంటే భూ సంస్కరణల ద్వారా లక్షలాది ఎకరాలను పేదలకు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైందని అన్నారు. పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను బ్యాంకులు జాతీయం చేసి సామాన్యుడు కూడా బ్యాంకు లోన్ తీసుకునే అవకాశం కలిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే అని డిప్యూటీ సీఎం అన్నారు. పాలనలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆర్టిఐ చట్టం, విద్య ద్వారానే సమాజం అభివృద్ధి సాధ్యమని యుజిసి ఏర్పాటు చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని అన్నారు. నవోదయ విద్యాలయాలు, సైంటిఫిక్ టెంపర్ మెంట్ ఈ దేశంలో నిలబడేందుకు సైన్స్ మరియు టెక్నాలజీ ముందు భాగంలో ఉండాలని నెహ్రూ కాలం నుంచి రాజీవ్ గాంధీ వరకు అనేక వ్యవస్థలను ఈ దేశంలో ఏర్పాటు చేశారు అంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైందని అన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలతో పోటీపడి ఎందుకు ఐఐటీలు, ఐఐఎంలు కాంగ్రెస్ పాలనలోనే స్థాపించబడ్డాయి, అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీల సీఈవోలుగా భారతీయులు రాణిస్తున్నారు అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకువచ్చిన ఐఐఎం వంటి మేనేజ్మెంట్ సంస్థలే కారణమని తెలిపారు. పుట్టిన ప్రతి బిడ్డకు చదువుకునే హక్కు, ప్రతి పౌరునికి ఆహారం అందించే నైతిక హక్కు వంటి చట్టాలు కాంగ్రెస్ పాలనలోనే వచ్చాయి అన్నారు. కూలి రేట్లు పెంచాలని ఈ దేశంలో దశాబ్దాలుగా ఉద్యమాలు, రక్తపాతం జరుగుతుంటే ఒక చుక్క రక్తపు బొట్టు కింద పడకుండా మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని ప్రతి గ్రామంలో తీసుకువచ్చి కనీస వేతనం 100 నుంచి 150 రూపాయల వరకు ఉండాలని చట్టం తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీని అని డిప్యూటీ సీఎం అన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశ నిలబడడానికి అవసరమైన రాజ్యాంగాన్ని అందించింది కాంగ్రెస్ ప్రభుత్వమే, పాకిస్తాన్ మయన్మార్ వంటి దేశాల్లో పరిపాలనను ఆర్మీ చేతిలోకి తీసుకోవడం, ప్రధానులు హత్యకు గురి కావడం వంటి సంఘటనలు జరుగుతుంటే మనదేశంలో మాత్రం ఎన్నికల తర్వాత ఎవరు గెలిస్తే వారు ఎటువంటి వివాదం లేకుండా అధికారం మార్పిడి జరుగుతుందంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని డిప్యూటీ సీఎం తెలిపారు.ఓటు హక్కును రక్షించుకోవడం మనందరి బాధ్యత భారతజాతి ఔన్నత్యం కోసం కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణ బద్ధుడై పని చేయాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతుంటే పార్లమెంట్లో బలం లేకపోయినా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనిని డిప్యూటీ సీఎం తెలిపారు. మహిళా సాధికారత, బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న తలంపు, ఎస్సీ ఎస్టీలకు సబ్ ప్లాన్ ద్వారా నిధుల కేటాయింపు, ఒకరిని మరొకరు ప్రేమించుకుని అసమానతలు లేకుండా ఎదగాలనేది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ దేశ సమగ్రత, సమైక్యత కోసం గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తమ జీవితాన్ని అంకితం చేశారని డిప్యూటీ సీఎం తెలిపారు.



