అసెంబ్లీ వేదికగా జలజగడం

` నేడు సభకు రానున్న సీఎం కేసీఆర్‌
` ఈ మేరకు ఎర్రవల్లి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న మాజీ సీఎం
` నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
హైదరాబాద్‌(జనంసాక్షి):అసెంబ్లీకి హాజరు కావాలని బీఆర్‌ఎస్‌ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. నేటి నుంచి ప్రారంభమయ్యే సమావేశాలకు తాను వస్తానని అధికార పక్షం ఎలాంటి ఎజెండాను ఖరారు చేస్తుందో చూసి ముందుకు వెళదామని పార్టీ నేతలతో పేర్కొన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌ నుంచి హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తన నివాసానికి మాజీ సీఎం చేరుకున్నారు.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అటు అసెంబ్లీ సమావేశాల్లో, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో బలంగా పోరాటం చేస్తామని కేసీఆర్‌ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ ఇటీవల మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు సీఎం రేవంత్‌?రెడ్డి కూడా దీటుగానే బదులిచ్చారు. తనదైన శైలిలో ఆయన విమర్శలు గుప్పించారు. దీంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు హాట్‌ హాట్‌గా ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టింటినట్లు, అసెంబ్లీని భ్రష్టు పట్టిస్తుందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మొదటి టర్మ్‌లో ఏడాదికి 32 రోజులు అసెంబ్లీని నడిపిస్తే, కాంగ్రెస్‌రెండేళ్లలో 2024లో 24 రోజులు, 2025లో 16 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు పెట్టిందన్నారు. బీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్‌రావు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.కాంగ్రెస్‌ హయాంలో రెండు సంవత్సరాల్లో 40 రోజులు మాత్రమే సభ నడిపారని హరీశ్‌రావు ఆరోపించారు. అంటే సగటున 20 రోజులు మాత్రమే సభ నడిపారని పెట్టడం లేదని అన్నారు. ఏడాదికి 45 రోజులు అసెంబ్లీ పెట్టాలని అన్న కాంగ్రెస్‌ నేడు 20 రోజులకు కుదించిందని అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోతే రెండు రోజులు సంతాప తీర్మానాలు పెట్టారు, మూడు శ్వేతపత్రాలు, ఒక రోజు కాళేశ్వరం కమీషన్‌ రిపోర్టు, బీసీ రిజర్వేషన్లపై ఒక రోజు మాత్రమే సభ పెట్టారన్నారు. ప్రతిపక్షంపై బురద జల్లడానికే సమావేశాలు పెడుతున్నారు తప్ప ప్రజా సమస్యలు చర్చించడానికి మాత్రం కాదని హరీశ్‌రావు విమర్శించారు. అసెంబ్లీని నడపడానికి ప్రభుత్వం భయపడుతోందన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఒక్క అంశంపై చర్చ పెట్టకపోతే అసెంబ్లీని నడిపి ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీని కాంగ్రెస్‌ అంగబలంతో, మందబలంతో నడుపుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు అసెంబ్లీని నడుపుతామని చెప్పిన వాళ్లు ఒక్కరోజు మాత్రమే గత అసెంబ్లీ సమావేశాలు పెట్టారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు టీఎంసీలను 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు కుదించారని హరీశ్‌రావు ఆరోపించారు. 45 టీఎంసీలు చాలు అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాశారా లేదా అని సూటిగా ప్రశ్నించారు. డిపెన్స్‌లో పడినప్పుడు అసెంబ్లీని పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తే కేసీఆర్‌ బయటకు వచ్చి పోరాటం చేశారని, అప్పుడు అసెంబ్లీలో లెంపలు వేసుకుని నిర్ణయాన్ని వాపస్‌ తీసుకుని తీర్మానం చేశారన్నారు. 45 టీఎంసీలతో ఏ జిల్లాను ఎండబెడతారు? నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు మూడు జిల్లాలో ఓ జిల్లాను ఎండబెడతారు? 45 టీఎంసీలపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సంతకం పెట్టారా లేదా? అని ఆయన ప్రశ్నలు సంధించారు. ఏడాది క్రితం డీపీఆర్‌ వాపస్‌ వస్తే ఇప్పటివరకు ఎందుకు తిరిగి సబ్మిట్‌ చేయలేదు? అదే విషయాన్ని కేసీఆర్‌ సూటిగా చెప్పారన్నారు.

నీటిపారుదలశాఖ అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో శాసనసభ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి నీటిపారుదల శాఖ అంశాలపై సమీక్ష చేపట్టారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, అధికారులు ఈసమీక్షలో పాల్గొన్నారు. నదీ జలాలు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. నదీ జలాల్లో వాటా, ఏపీతో వివాదాలు, బీఆర్‌ఎస్‌ హయాంలో అనుసరించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు, తదితర అంశాలపై సీఎం ఆరా తీశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా సమీక్షించారు. సమావేశాల్లో ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్న తరుణంలో అందుకు సంబంధించిన అన్ని అంశాలపై దృష్టి సారించారు. ప్రాజెక్టు ప్రతిపాదించినప్పటి నుంచి పరిణామాలు, బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్ణయాలు, పురోగతి, గత రెండేళ్లుగా పనులు.. ఇలా అన్ని వివరాలు తీసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై గురువారం ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇవ్వనున్న ప్రజెంటేషన్‌కు సంబంధించి కూడా చర్చ జరిగినట్లు తెలిసింది.

 

అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులు నిర్వహించాలి
` ప్రతిపక్షంపై బురద జల్లడానికే సమావేశాలు పెడుతున్నారు తప్ప ప్రజా సమస్యలు చర్చించడానికి కాదు: హరీశ్‌రావు
హైదరాబాద్‌(జనంసాక్షి): శాసనసభను కాంగ్రెస్‌ భ్రష్టు పట్టించిందని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత రాష్ట్ర సమితి సగటున 32 రోజులు అసెంబ్లీ నడిపితే.. కాంగ్రెస్‌ సగటున 20 రోజులే సమావేశాలు నిర్వహించిందన్నారు. ‘‘సభ నడిపేందుకు ప్రభుత్వం జంకుతోంది. మేం ఇచ్చిన అజెండాను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోదు. సభను కాంగ్రెస్‌ నిర్వీర్యం చేస్తోంది. ఎన్ని రోజులైనా సభ నడుపుతామని.. చివరికి ఒక్క రోజుతో ముగిస్తారు. కనీసం 15రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నాం. శాసనసభా వ్యవహారాల మంత్రిగా శ్రీధర్‌బాబు విఫలమయ్యారు. రెండేళ్లు దాటినా.. అసెంబ్లీలో ఒక్క హౌస్‌ కమిటీ వేయలేదు’’ అని హరీశ్‌రావు విమర్శించారు.