సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా చూడండి

బీసీ సంక్షేమానికి నిధులు పెంచుతాం
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌
హైదరాబాద్‌, జూన్‌ 26 (ఎపిఇఎంఎస్‌): ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకి చేరువగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వాధికారులు ముఖ్య భూమిక వహిస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.  ప్రభుత్వం ఇస్తున్న నిధులను క్షేత్రస్థాయిలో ఉండే నిజమైన లబ్ధిదారులకి అందించే బృహత్తరమైన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉంటుందన్నారు. నిధుల వితరణ విషయంలో పారదర్శకత, ఖచ్చితత్వాన్ని అధికారులు తప్పనిసరిగా పాటించాలన్నారు.  మంగళవారం యూసుఫ్‌గూడలో గల నేషనల్‌ ఇన్‌స్టిస్ట్యూట్‌ ఆఫ్‌ మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ ప్రైజస్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి బిసి సంక్షేమ శాఖాధికారుల రెండు రోజుల సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిసిలకు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలనే ఉద్దేశ్యంతో బిసి సంక్షేమ శాఖ బడ్జెట్‌ను ఈ సంవత్సరం రూ. మూడు వేల17 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. 1994-2004 మధ్య కాలంలో ఏడాదికి సుమారు రూ.158 కోట్లు బడ్జెట్‌ కేటాయించగా 2004-2011 మధ్య కాలంలో ఏడాదికి రూ.900 కోట్లు బడ్జెట్‌ కేటాయించే స్థాయికి బిసి సంక్షేమ శాఖను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.  ఈ ఏడాది ఇచ్చిన బడ్జెట్‌ వినియోగంతో మంచి ఫలితాలు సాధిస్తే వచ్చే ఏడాది మరింత ఎక్కువ నిధులు బిసి సంక్షేమ శాఖకు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. చదువు కేవలం ఉద్యోగ సముపార్జనకే కాకుండా మనిషి ఆలోచన విధానాన్ని మెరుగుపరిచి సరైన మార్గంలో జీవితం నడిపించేలా ఉండాలనే ఉద్దేశ్యంతో బిసి విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌లు ఇస్తున్నామన్నారు.. కుల వృత్తులకు కొంత ఆధునికతను జోడించి కులవృత్తి దారులు తమ వృత్తిని కొనసాగించి మెరుగైన జీవనోపాధిని కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలు రాసే బిసి విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే రాష్ట్రంలో 15 స్టడీ సర్కిల్స్‌ను ఏర్పాటు చేశామని, వాటితో పాటు మరో ఏడు స్టడీ సర్కిల్స్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులకు కులాల ఆధారంగా శిక్షణ కేంద్రాలు కాకుండా అందరికి కలిపి సమగ్రంగా జిల్లాకి 1 లేదా 2 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు.  బిసి సంక్షేమ శాఖ మంత్రి బసవరాజు సారయ్య మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వాధికారులు చొరవ తీసుకొని పని చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో బాలబాలికలు హాస్టల్స్‌ ఏర్పాటు చేశామన్నారు. హాస్టల్స్‌లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకునేలా హాస్టల్‌ వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ సారించాలన్నారు. బిసి స్టడీ సర్కిల్స్‌ ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణనిచ్చి రాజీవ్‌ యువ కిరణాల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎకె పరీదా, సంచాలకులు ఉమర్‌ జలీల్‌, బిసి ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎం.డి. ఎన్‌. కృష్ణ, జిల్లా బిసి సంక్షేమ శాఖాధికారులు, అసిస్టెంట్‌ బిసి సంక్షేమ శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.