ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు సఫలం
` దీపావళిలోగా రూ.1200 కోట్ల బకాయిలు విడుదలకు ప్రభుత్వం హామీ
` ఫీజురియింబర్స్‌మెంట్ రేషనలైజేషన్‌కు కమిటీ: భట్టి
` బంద్‌ను ఉపసంహరించుకున్నట్లు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాల ప్రకటన
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలోని వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీపావళిలోగా రూ.1200 కోట్ల బకాయిలు విడుదల చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఫీజురియింబర్స్‌మెంట్ అంశంపై మంత్రులు భట్టివిక్రమార్క, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో జరిపిన చర్చలు ముగిశాయి. చర్చలు సఫలం కావడంతో తరగతుల బంద్‌ను ఉపసంహరించుకున్నట్లు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో మంగళవారం నుంచి తరగతులు యథాతథంగా కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విద్యార్థుల భవిష్యత్తు తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశం. ఫీజు రియింబర్స్‌మెంట్ పథకం పేద, మధ్యతరగతి విద్యార్థులకు వరంలాంటిది. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాన్ని ఛిన్నాభిన్నం చేసింది. పదేళ్ల పాటు ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులను పెండిగ్‌లో పెట్టి భారంగా మార్చింది. వారు విధ్వంసం చేసిన అంశాలను మేం క్రమక్రమంగా సరిదిద్దుతున్నాం. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఫీజురియింబర్స్‌మెంట్ సమస్యను కూడా పరిష్కరిస్తాం. ఈ పథకానికి సంబంధించి కళాశాలల వద్ద రూ.600 కోట్ల విలువైన టోకెన్లు ఉన్నాయి. ఇప్పటికే టోకెన్లు ఇచ్చిన రూ.600 కోట్ల నిధులు ఈ వారంలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చాం. ఫీజు రియింబర్స్‌మెంట్ రేషనలైజేషన్ కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించాం. మా విజ్ఞప్తి మేరకు కళాశాలల బంద్‌ను విరమించుకున్నట్లు యాజమాన్యాలు చెప్పాయి. బంద్ విరమణకు ముందుకొచ్చిన యాజమాన్యాలకు ధన్యవాదాలు’’ అని తెలిపారు.